హనుమకొండ, అక్టోబర్ 22 : ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యంకనం-1 (ఎస్.ఏ) పరీక్షలు 24 నుంచి 31 వరకు జరుగుతాయని
హనుమకొండ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డి.సి.ఇ.బి.) చైర్మన్, జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి, డి.సి.ఇ.బి. కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన
ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి విద్యార్థి పరీక్షలకు హాజరవుతారని, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాద్యమంలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డుకు ఫీజు చెల్లించిన ప్రకారం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 56194 మంది విద్యార్థులు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 14646 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, వీరిలో తెలుగు మాద్యమంలో 200, ఇంగ్లీష్ 14097, ఉర్దూలో 349 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో 267, ఇంగ్లీష్‌లో 55766, ఉర్దూలో 161 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వారు వివరించారు.
ప్రభుత్వం నిర్ణయించిన టైం టేబుల్‌ను అనుసరించి అన్ని యాజమాన్యాలు హనుమకొండ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సరఫరా చేసిన ప్రశ్నాపత్రాలతోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, పరీక్షల నిబంధనలు ఉల్లంఘించినట్టయితే పరీక్షల నియామావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల విద్యాధికారుల నుంచి పరీక్షకు ఒకరోజు ముందుగా ప్రధానోపాధ్యాయులు ప్రశ్నాపత్రాలు తీసుకువెళ్లి, సీనియర్ ఉపాధ్యాయుడు జాయింట్ కస్టోడియన్‌గా ప్రశ్నాపత్రాలను పాఠశాలలో భద్రపరచాలని సూచించారు. మండల విద్యాధికారులు, ఎం.ఎన్.ఓలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించాలని వారు కోరారు.