దేవరుప్పుల, మార్చి 20: ‘కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను అరకొర అమలు చేసింది. అన్ని వర్గాలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నీళ్లుండి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండగా యాసంగి పంటలు ఎండి రైతులు ఆగమైండ్రు. వారు మర్లబడే రోజొచ్చింది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టగా, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళం విప్పారు. ఎండిన పంటలు చేత బూని తమ నిరసన తెలిపారు. దీక్షకు మద్ద తుగా ఎర్రబెల్లి హాజరై మాట్లాడారు.
సాగునీటి మీద కనీస ప్రణాళిక, అవగా హన ప్రభుత్వానికి లేక దేవాదుల నీరు వదలక రిజర్వాయర్లలో నీరు లేక చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి బోర్లు, బావులు ఎండాయన్నారు. కేసీఆర్ పాలనలో నీళ్లు న్నాయనే నమ్మకంతో రైతులు నాట్లు వేశారని, ఇప్పుడు ఒక్క తడితో చేతికొచ్చే పంటలను పశు వులకు మేపుతుండ్రని, వారికి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు ఇచ్చే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, దీనికి దేవరుప్పుల రైతులు నాంది పలికారన్నారు.
రేవంత్‌రెడ్డి మూర్ఖుడని, జనం బలహీనతను ఓట్లుగా మార్చుకుని గద్దె నెక్కాడన్నారు. ఆయన నిజస్వరూపం ప్రజలకు అనతి కాలంలోనే తెలిసిపోయిందని, ఇప్పడు ఎన్నికలేవైనా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని పేర్కొన్నారు. చెన్నూరు. పాలకుర్తి, ఉప్పుగల్లు రిజర్వాయర్ల పనులు ఆగాయని, రూ. 500 కోట్లతో మంజూరైన పనులు చేయడానికి ఏం వచ్చిందని ప్రశ్నించారు. సాగు నీరులేక రైతుల పంటలు ఎండుతుంటే ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించాల్సింది పోయి అనవసర విషయాలను మాట్లాడడం ఆమె పని తీరును చాటుతుందన్నారు. తాను నీటిని వదలాలని అధికారులకు కోరితే రాకుండా చేస్తుందని, పాలన మరచి బీఆర్ఎస్ నాయకులు, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలో జలకళ సంతరించుకున్నదని, తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎండాకాలంలో చెరువులు, కుంటలు నింపేదని, దీంతో పుష్కలంగా భూగర్భ జలాలు ఉండేవన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చిందని రైతులు మరచిపోతున్నారని, ఇటు ఎస్సారెస్పీ అటు దేవాదుల నీరు రాక వారు ఆగమై సర్కారుకు శాపనార్థాలు పెడుతున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. దీక్ష అనంతరం రూ. 25 వేలు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ రైతులతో పాటు కిలోమీటర్ నడిచి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం కామారెడ్డిగూడెంలో రైతు మరాఠి యాదగి రి నాలుగెకరాల వరి పంట ఎండగా, పరిశీలించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, వీరారెడ్డి దామోదర్ రెడ్డి, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్, బస్వ మల్లేశ్, ఏల సుందర్, చింత రవి, కొల్లూరు సోమయ్య, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్‌రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, మాజీ జడ్పీటీసీలు శ్రీని వాస్, పూస్కూరి శ్రీనివాస్‌రావు, గూడూరు పీఏసీఎస్ చైర్మన్ బొబ్బల అశోక్‌రెడ్డి, బీఆర్ఎస్ పాలకుర్తి, తొర్రూరు మండ ల అధ్యక్షులు నవీన్, సీతారాం, రాంసింగ్, వంగ అర్జున్, కోతి ప్రవీ ణ్, కుతాటి నర్సింహులు, ఇంటి మల్లారెడ్డి, సంజీవరెడ్డి, నవీన్‌నాయక్, కృష్ణమూర్తి, బిళ్ల యాద వరెడ్డి, గిరి, కృష్ణ ఉన్నారు.
బంజర చెరువుల బర్రెదుడ్డెలకు తాపుదామంటె నీళ్లు లేవు. ఇంత అన్యాయం అయితదనుకోలే. కేసీఆర్ పుణ్యమా అని మిషన్ కాకతీయల చెరువులు బాగుపడ్డయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందు రెండు కార్లు చెరువులు నింపేది. ఎకరంన్నర నాటు పెడితె నీళ్లు ఎండిపోయింది. పదేండ్ల నుంచి ఇట్ల చూడలేదు. యాసంగి పంటలు 70 శాతం ఎండినయ్. నీళ్లు తేవాలనే సోయి ఉన్న నాథుడే లేడు. రేవంత్‌రెడ్డికి పాలన చేతకాదని తేలిపోయింది.
– సంగి నర్సయ్య, రైతు బంజర