పంట సాగులో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రావొద్దని ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కింది. యాసంగి 2023, వానకాలం 2024లో పెట్టుబడి సాయం ఇవ్వకుండా పంగనామాలు పెట్టింది. పెట్టుబడి సాయం ఎగ్గొట్టడంతో బీఆర్ఎస్తోపాటు రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మొన్నటి యాసంగిలో రైతుభరోసా పథకాన్ని ప్రారంభింది. అది కూడా ఎకరాకు రూ. 15 వేలిస్తామని.. రూ.12వేలకే కుదించి..కేవలం 4 ఎకరాల వరకే రైతులకు అరకొరగా అమలు చేసి సగం మందికి ‘చేయి’చ్చింది. యాసంగి ముగిసినప్పటికీ జనగామ జిల్లాలో సగం మంది పెట్టుబడి సాయం అందక రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఈ సీజన్లోనైనా అందరికీ అందేనా? అసలు రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందా..లేదా? అన్న సందేహం వ్యక్తమవుతున్నది.
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నది. అన్ని పంటలకు మద్దతు ధర, వడ్లకు రూ.500 బోనస్, రూ.2లక్షల రుణమాఫీ వంటి హామీలెన్నో ఇచ్చి..ఏ ఒక్కటీ సరిగా అమలు చేయకుండా సర్కారు చేతులెత్తేసింది. రూ.2లక్షల రుణమాఫీ సగం మందికీ కాలేదు..రైతుభరోసా రూ.12వేలకు కుదించినా..అదీ అందరికి ఇవ్వలేదు. అన్ని పంటలకు మద్దతు ధర మాటలకే పరిమితమైంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఠంచన్‌గా రైతుబంధు పడేది..కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఎగవేతలతోనే సరిపెడుతున్నది. ఇప్పుడు పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు మండిపడుతున్నారు.
జనగామ జిల్లాలో సగం మంది ఆశలపై నీళ్లు..
అన్నదాతలకు పంట పెట్టుబడి గోస తీర్చాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ సర్కారు మొదట ఎకరానికి ఏడాదికి రూ. 8000 ఇచ్చి ఆ తర్వాత రూ.10 వేలకు పెంచింది. జనగామ జిల్లాలో ప్రతి సీజన్‌కు 1,69,465 మంది రైతులకు చెందిన 4,11,230 ఎకరాలకు రూ.205 కోట్ల పెట్టుబడి ఏడాదికి రెండుసార్లు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇలా 2018 వానకాలం నుంచి 2023 యాసంగి వరకు మొత్తం 11 విడుతల్లో అందించింది. రైతు బీమా పథకం కింద జిల్లాలో మరణించిన 2071 రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ. 103.55 కోట్ల బీమా పరిహారం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మొన్న యాసంగిలో సగం మందికే పెట్టుబడి సాయం ఇచ్చిన ప్రభుత్వం వానకాలం సాయంపై నోరు మెదపడంలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పూటకోమాట మాట్లాడుతుండడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉచితాల పేరిట రైతుభరోసాకు ఎగనామం పెట్టే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా రైతులు పెట్టుబడుల కోసం మళ్లీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలనలో కనిపిస్తున్నది. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునే ప్రస్తుత తరుణంలో పెట్టుబడి సాయం ము ఖ్యమని లేదంటే అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన మునుపటి పరిస్థితి తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు.