వాజేడు, జూన్ 9 : మండలంలోని టేకులగూడెం చెలక గ్రామానికి తాగునీళ్లు వచ్చాయి. ‘గోదావరి నీళ్ల కోసం..’ శీర్షికన గ్రామస్తులు కాలినడకన రెండు కిలోమీటర్లు వెళ్తున్నారని ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు ఈఈ సుభాష్, డీఈఈ వెంకట సతీశ్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో తాగునీటి ఇబ్బందులపై గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. గోదావరి నుంచి నీళ్లు సరఫరా చేసే మోటర్ మరమ్మతులకు గురవడం, విద్యుత్ సరఫరాలో వల్ల రెండు రోజులుగా గ్రామంలోని మోటర్ ద్వారా నీరు సరఫరా కావడం లేదని తెలిపారు. దీంతో అధికారులు మోటర్ ద్వారా గ్రామంలోకి నీటి సరఫరా చేయించారు. ఈ నీటిని కూడా తాగాల్సి ఉండగా గ్రామస్తులు గృహావసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కాగా, గ్రామస్తులు తాగేందుకు ఉపయోగించే గోదావరి నీటి సరఫరా కోసం మోటర్ మరమ్మతు చేయించామని, సోమవారం మోటర్ బిగించి సరఫరా చేయనున్నట్లు డీఈఈ వెంకటసతీశ్ తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.