హనుమకొండ చౌరస్తా/తొర్రూరు, సెప్టెంబర్ 20 : దసరా సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించారు. దీంతో సొంతూళ్లకు బయల్దేరుతున్న ప్రయాణికులతో బస్టాండ్లలో పండుగ సందడి నెలకొంది. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్-1, 2 హనుమకొండ, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, జనగామ డిపోల వారీగా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ మహాలక్ష్మీ పథకంతో అవన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి.
హైదరాబాద్కు 1284 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరిట 50 శాతం అదనంగా బాదుతోంది. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. శనివారం వరంగల్ రీజియన్లోని బస్స్టేషన్లు పండుగ జనంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
రోజు నడిచే బస్సులకే ‘స్పెషల్ బస్సులు’ అని బోర్డులు పెట్టి, టికెట్ ధరలను 50 శాతం వరకు పెంచి వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉప్పల్-తొర్రూరు మార్గంలో సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ.300 నుంచి ఒకసారిగా రూ.430కి పెరగగా, మహబూబాబాద్ నుంచి ఎంజీబీఎస్ టికెట్ ధర రూ.220 నుంచి రూ.290కి పెరిగింది. ఉన్నవాటినే స్పెషల్ బోర్డులు పెట్టి మోసం చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగ పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వెంటనే నిలిపివేయాలని, లేకపోతే పెద్దఎత్తున నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.