టెహ్రాన్ : ఇరాన్లో ఇవాళ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతగా నమోదు అయ్యింది. దక్షిణ ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్సులో ఉన్న ఖోంజ్ వద్ద భూకంప కేంద్రం ఉన్నది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదు అయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. స్థానిక కాలమానం 10.24 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. గీరశ్ అనే పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నది. 4.3 తీవ్రత భూకంపాన్ని స్వల్ప స్థాయి నుంచి మధ్యస్థాయి ప్రకంపనగా భావిస్తారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న వారు షేక్ అయి ఉంటారు. కానీ బిల్డింగ్‌లకు ఎటువంటి ప్రమాదం జరిగి ఉండదని భావిస్తున్నారు. సునామీ వార్నింగ్ ఇవ్వలేదు. దక్షిణ ఇరాన్ భూకంపాలు వచ్చే జోన్లోనే ఉన్నది.
మరోవైపు ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. నటాంజ్‌లోని అండర్‌గ్రౌండ్ యురేనియం శుద్దీకరణ ప్లాంట్‌పై అమెరికా దళాలు దాడి చేసినట్లు స్పష్టం అయ్యింది. కొలరాడోకు చెందిన వాంటర్ కంపెనీ రిలీజ్ చేసిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం లోపే నటాంజ్ అణు కేంద్రంలో మార్పులు సంభవించినట్లు గుర్తించారు. అయితే ఆ మార్పులకు చెందిన స్పష్టమైన సంకేతాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నట్లు అణు నిపుణుడు డేవిడ్ ఆల్బ్రైట్ పేర్కొన్నారు.అయితే ఆ అణు కేంద్రంపై అమెరికానా లేక ఇజ్రాయిల్ దాడి చేసిందా అన్న విషయాన్ని చెప్పలేకపోయారు.
వాంటర్ రిలీజ్ చేసిన పిక్స్ ప్రకారం.. నటాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌లో కొన్ని బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. మార్చి 1, మార్చి 2వ తేదీల్లో తీసిన చిత్రాలను వాంటర్ రిలీజ్ చేసింది. మార్చి 2వ తేదీన తీసిన చిత్రాల్లో కొన్ని బిల్డింగ్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. గత ఏడాది జూన్‌లో కూడా ఇజ్రాయిల్ దళాలు నటాంజ్ కేంద్రంపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఆదివారం కూడా మళ్లీ ఆ కేంద్రంపైనే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేసినట్లు ఇరాన్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన అటామిక్ ఎనర్జీ సంస్థకు ఈ అంశం గురించి ఇరాన్ అటామిక్ ఎనర్జీ చీఫ్ ఇస్లామి లేఖ రాశారు.