government : ఇకపై ఒక ప్రభుత్వ అధికారికి ఒకే కారు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన పద్దుల విభాగం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ‘ఒక అధికారికి ఒకే ప్రభుత్వ కారు (వన్ అఫీసర్.. వన్ అఫీషియల్ కార్)’ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కొత్త మార్గదర్శకాల్ని అమలు చేయనుంది ప్రభుత్వం. గతంలో ఒక అధికారికి ఒక శాఖకు చెందిన బాధ్యతలు ఉంటే ఒక కారు ఉండేది.
ఆ అధికారికి అదనంగా మరో శాఖను కేటాయిస్తే.. ఆ శాఖ నుంచి ఇంకో ప్రభుత్వ కారు వినియోగించుకునే అవకాశం ఉండేది. అంటే, ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలకు చెందిన కార్లను విచ్చలవిడిగా వాడేవారు. ఇకపై అలా కుదరదు. ఒక అధికారికి ఎన్ని శాఖలున్నా.. ముందుగా కేటాయించిన ఒక్క కారును మాత్రమే వాడుకోవాలి. అదనపు శాఖలు కేటాయించినంత మాత్రానే అదనపు కార్లను వాడకూడదు. అంటే ఒక్క అధికారికి ఒకే కారు. వారి శాఖలతో పని లేదు. దీనివల్ల ప్రభుత్వం విధుల కోసం కేటాయించే కార్ల దుర్వినియోగం ఆగుతుందని, వేరు వేరు కార్లు వాడటం కుదరదని, నిధులు కూడా మిగులుతాయని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాహనాల వినియోగానికి సంబంధించి 2022 సెప్టెంబర్లో విడుదల చేసిన మార్గదర్శకాలకు అదనంగా కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.
వేర్వేరు మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల్ని అధికారులు పర్యవేక్షించినా సరే.. వారికి ఇకపై ఒకే కారును కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమలువల్ల మిగిలిపోయే వాహనాల్ని ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంచాలి. వాటిని ఇకపై అనధికారికంగా వాడటం కుదరదు. ప్రభుత్వ వనరుల్ని సమర్ధవంతంగా వాడటం, దుర్వినియోగాన్ని అరికట్టడం, రవాణా ఖర్చుల్ని తగ్గించడం అనే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఇకపై ఈ నిబంధనలు అమలవుతాయి.