అటవీ ప్రాంతాల్లోని భూములను అటవీ ప్రాంతానికి సంబంధం లేని ప్రాజెక్టులను చేపట్టటానికి గ్రామసభల నుంచి అనుమతి పొందాలనే నిబంధనేదీ అటవీ హక్కుల చట్టం 2006లో లేదని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత నెల 31న వివాదాస్పద సర్క్యులర్ జారీ చేసింది. కేంద్ర విద్యుత్తు శాఖ పరిధిలోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అటవీ ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు ఆటంకాలు లేకుండా ఈ సర్క్యులర్‌ను విద్యుత్తు శాఖకు పంపించింది. ఈ నిర్ణయం ప్రకటించడానికి ముఖ్య కారణం; అటవీ హక్కుల చట్టం కింద గ్రామసభ నుంచి 100% ఆమోదం అనే ‘కీలకమైన అడ్డంకి’ కారణంగా అటవీ ప్రాంతాల్లో నెలకొల్పే పలు ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నది. అంతేకాకుండా ఇటువంటి విషయాలు తమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాబోవని కూడా స్పష్టం చేసింది.
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అటవీ ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టుల మీద పార్లమెంటరీ స్థాయీ సంఘం అదే నెల 3న ఇచ్చిన నివేదిక ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం. ఆ నివేదికలో..నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అటవీ అనుమతి పొందటానికి సగటున 106 నెలల సమయం పడుతుంది. అయితే, ఆయా ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూమి మళ్లింపునకు సంబంధిత గ్రామసభలన్నీ అంగీకరించాలనే నిబంధన ‘అత్యంత కీలకమైన అడ్డంకిగా’ మారిందని పేర్కొన్నది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులకు ప్రభావిత గ్రామసభల్లో 70-75% సమ్మతి సరిపోతుందని తెలిపింది. గ్రామసభ నుంచి 100% సమ్మతి అవసరమనేది మంచి ఉద్దేశంతో కూడుకున్నప్పటికీ, ఆచరణలో ఇది కష్టంగా మారిందని, ఈ నిబంధన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నది.
ప్రభావిత గ్రామాల్లో 70-75% సమ్మతి ఉంటే సరిపోతుందని భావించే నిబంధన అమల్లోకి వస్తే..అది గ్రామసభలను, అక్కడి ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి బదులు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను మాత్రమే కాపాడుతుంది. ప్రతి ప్రభావిత గ్రామసభ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని అటవీ హక్కుల చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఈ అంశం తమ పరిధిలో లేదని సదరు మంత్రిత్వ శాఖ ప్రకటించటం విచారకరం.
జల్, జంగిల్, జమీన్. ఈ మూడింటినీ కాపాడుకోవాలంటే గిరిజనుల స్వయంపాలిత హక్కుల్లో భాగంగా సాధించుకున్న గ్రామసభ ఆమోదం గిరిజనులకు జీవనాడి లాంటిది. ఈ ఆయుధాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యల్లో భాగమే గిరిజన మంత్రిత్వ శాఖ ప్రకటన.
అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల జీవనోపాధి, సంస్కృతి, గుర్తింపు, రాజకీయ స్వయం ప్రతిపత్తికి భూమి ప్రధాన పునాదిగా ఉంటుంది. మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా ‘అటవీ పరిరక్షణ బిల్లు-2023’ను తీసుకువచ్చింది. దీని ప్రకారం దేశ సరిహద్దు రేఖ నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉన్న దాదాపు 7 లక్షల చదరపు కిలోమీటర్ల భూములన్నింటినీ ఏ ఆంక్షలు లేకుండా కార్పొరేట్ కంపెనీలకు అడవులను కట్టబెడతారు. ఇంతకుముందు అడ్డుగా ఉన్న పర్యావరణ పరిరక్షణ శాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖలను నిర్వీర్యం చేసి, వాటి నుంచి ఎటువంటి అనుమతులు పొందే అవసరం లేకుండానే కార్పొరేట్లు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే 10 కోట్ల మంది ఆదివాసీలను నేషనల్ పార్కులు, టైగర్ జోన్స్, రిజర్వ్ ఫారెస్ట్లు, మైనింగ్ లీజులు, సౌర విద్యుత్తు పేరిట అడవి నుంచి తరిమివేసే చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే గనులను తవ్వి తీయడం నెపంతో కార్పొరేట్ కంపెనీలు అడవులను నరికివేయడం వల్ల వాతావరణ మార్పులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా అకాల వర్షాలు, వరదలు, విపరీతమైన వేడి వంటి వాటితో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు దేశమంతా కోడై కూస్తున్న ఎల్ నినో ప్రభావం ఈ చర్యల నుంచి పుట్టుకొచ్చిందే! అటవీ సంపదతో పాటు, మనకు అపారంగా ఉన్న సహజ వనరులను వికసిత్ భారత్ పేరుతో ఆఖరికి చట్టాలను కూడా మార్చేసి బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న ఫలితంగానే ఈ పరిస్థితి దాపురించింది.
అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు గ్రామసభల అనుమతి అవసరం లేదనే నిర్ణయం గిరిజన ప్రజానీకాన్ని కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు బలిపశువులుగా చేసే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఇందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గిరిజన సంఘాలు ఒక తాటి మీదకు వచ్చి సమైక్య ఆందోళనలు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో జంతువులు, వైవిధ్య భరిత వాతావరణం, సంప్రదాయిక అటవీ సంపదను విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడేందుకు, గిరిజన ప్రజానీకానికి రాజ్యాంగం ప్రసాదించిన గ్రామసభల అనుమతి హక్కును రక్షించేందుకు అన్ని గిరిజన సంఘాలు సమైక్యంగా పోరాటం సాగించాలి. వీరి పోరాటానికి హక్కుల సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు చేదోడు వాదోడుగా నిలబడాలి. గిరిజన ప్రజానీకానికి ఉరితాడుగా మారబోతున్న సర్క్యులర్‌ను బేషరతుగా ఉపసంహరించుకునే వరకు రాజీలేని పోరాటం సాగించాలి.