గద్వాల, సెప్టెంబర్ 21: ‘నీళ్లివ్వకుంటే పంటలెండిపోతయ్. ఇక మాకు చావే శరణ్యం. అక్కడ చావడం కంటే సీఎం, మంత్రులు, గద్వాల ఎమ్మెల్యే కలిసి మాకింత విషమిస్తే ఇక్కడే చస్తాం’ అని రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. ‘సాగునీరు అందక రూ.లక్షలు ఖర్చుచేసి సాగుచేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లొదిలే వరకు ఆందోళన విరమించేది లేదు’ అంటూ కదంతొక్కారు. ఎలాగైనా సాగునీరివ్వండని కోరుతూ అదనపు కలెక్టర్ కాళ్లపై పడి మహిళా రైతులు వేడుకున్నారు. జోగుళాంబ-గద్వాల జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగిన రైతుల ధర్నాలో చోటుచేసుకున్న ఈ ఘటనలు రైతుల దయనీయ పరిస్థితికి అద్దంపట్టాయి.
సీఎం, గద్వాల ఎమ్మెల్యే, అధికారులకు వ్యతిరేకంగా అక్కడికొచ్చిన రైతులు నినదించారు. జూరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఉదయమే పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్‌కు చేరుకొని రాస్తారోకో చేపట్టారు. పోలీసులు గమనించి వెంటనే వాహనాలను వేరే దారి వైపు మళ్లించడంతో ఆగ్రహించిన రైతులు కలెక్టరేట్ నుంచి నడుచుకుంటూ సుమారు 2 కిలోమీటర్లు వెళ్లి జమ్మిచేడు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. దీంతో ఇటు గద్వాల, అటు కర్నూలు వైపు సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం 4:30 వరకు కొనసాగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 13 ఏండ్లలో ఇంతసేపు రైతు నిరసన కొనసాగలేదు. తమ కండ్ల ముందే పంటలు ఎండిపోతుండడతో కడుపు మండిన పలువురు అన్నదాతలు రోడ్డెక్కారు. అన్నదాతలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు తెలుపడంతో ఆందోళన మరింత ఉధృతంగా మారింది. నీటి విడుదల విషయంలో రైతులకు ఎవరూ హామీ ఇవ్వకపోవడంతో రైతులే ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు. ఈలోపు సాగునీరు విడుదల చేసి తమ పంటలు కాపాడితే సరి.. లేదంటే అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
‘నీ కాళ్లు మొక్కుతాం.. సాగునీళ్లు ఇవ్వండి’..
జిల్లా కేంద్రంలో దాదాపు 6 గంటలపాటు రైతుల ఆందోళన కొనసాగింది. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని కర్షకులు తేల్చిచెప్పారు. దీంతో అదనపు కలెక్టర్ మధుమోహన్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే యత్నం చేశారు. ‘కడుపు మండిన రైతులం సారూ.. మీ కాళ్లు మొక్కుతాం.. మా పంటలకు నీళ్లిచ్చి కాపాడండి’ అంటూ పలువురు మహిళా రైతులు అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నారు. స్పందించిన ఆయన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఈఈ కేశవరావు రైతులతో మాట్లాడుతూ ప్రాజెక్టులో నీరు లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆయన కూడా అక్కడి నుంచి వెనుదిరిగారు.
అంబులెన్స్‌లతో ధర్నాను భగ్నం చేసే యత్నం

ఇరువైపులా ఒక్క వాహనం కూడా వెళ్లకుండా రైతులు రోడ్డును దిగ్బంధించారు. ఆందోళనను ఎలాగైనా భగ్నం చేయాలని అధికారులు అంబులెన్స్‌ల ప్రయోగం చేశారు. అంబులెన్స్‌ల్లో రోగులెవరూ లేకు న్నా ప్రతి అరగంటకు ఒకసారీ వరుసగా రెండు, మూడు అంబులెన్స్‌లు ఆ రహదారిపై పంపుతూ ధర్నాను భగ్నంచేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన రైతులు చివరికి అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు. పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. రైతుల మధ్య తోపులాట జరిగింది.