హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): జూరాల ప్రాజెక్టు జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ఉన్నది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ప్రాజెక్టు ఎడమ కాలువ దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. దీని కింద అమరచింత, ఆత్మకూరు, మదనాపూర్, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల పరిధిలో 69 వేలకు పైగా ఆయకట్టు ఉంటుంది. కుడికాలువ పొడవు 46 కిలోమీటర్లు. ఇది ధరూర్, గద్వాల, ఇటిక్యాల, మనోపాడు మండలాల పరిధిలో మొత్తంగా 35 వేలకుపైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. మొత్తం గా ప్రాజెక్టు కింద సుమారు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది.
ప్రాజెక్టును పూర్తిసామర్థ్యంతో నింపితే 10 టీఎంసీల నీటితో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ‘దేవుడు కరుణించినా’ అన్నట్టుగా కృష్ణమ్మ కరుణించినా, ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 21వరకు జూరాల ప్రాజెక్టుకు 243 టీఎంసీల జలాలొచ్చాయి. వాటిని ఒడిసిపట్టట్టి మళ్లించలేదు. ఎత్తిపోయలేదు. దీంతో దాదాపు 223 టీఎంసీలు దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు తరలిపోయాయి. జూరాల ఆయకట్టుకు కేవలం వరదల సమయంలో 6.3 టీఎంసీలు మాత్రమే వదిలింది. పొట్టదశకు వచ్చే కీలక సమయంలో సాగునీటిని ఇవ్వలేమని సర్కార్ చేతులెత్తేసింది. దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జూరాలపై ఆధారపడిన నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులన్నీ కలిపి 20 టీఎంసీలనూ వినియోగించలేదు.

అక్కడ కృష్ణా ‘గలగలలు’
జూరాల నుంచి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు తరలిపోయిన 223 టీఎంసీలను ఏపీ ఒడిసిపట్టుకున్నది. వరద ప్రవాహం ప్రారంభంకాగానే జలాల మళ్లింపును చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుపై మల్యాల లిఫ్ట్‌లో భాగంగా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కృష్ణా జలాలను మళ్లించింది. ఈ లిఫ్ట్ స్కీమ్ కెనాల్ మొత్తంగా 700 కిలోమీటర్లు ఉం టుంది. ఈ కెనాల్‌పై చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. ఈ బ్రాంచ్ కెనాల్ పొడవు 123 కిలోమీటర్లు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి జలాలను అక్కడి వరకు తరలించింది.
కాలువల్లో నీళ్లు రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో ‘జలహారతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీ సీఎం కుప్పంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 700కు పైగా కిలోమీటర్ల ఆవల ఉన్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించామని, ఈ ఘనత తనదేనని, ఆచరణ సాధ్యం కాదనుకున్నవారే ఆశ్చర్యపోయేలా చేశామని చెప్పారు. దీనినిబట్టి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వ వైఫల్యంతో కృష్ణాజలాలు దిగువకు వెళ్లిపోయాయని, అక్కడి నుంచి 700 కిలోమీటర్ల ఆవల ఉన్న కుప్పానికి తరలిపోయాయనేది స్పష్టంగా అర్థమవుతున్నది.

కుప్పంకు శ్రీశైలం నీళ్లు.. నా ఘనతే!
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపు 700 కి.మీ దూరాన ఉన్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించామని ఏపీ సీఎం బాబు వెల్లడించారు. ఆచరణ సాధ్యం కాదనుకున్నవారే ఆశ్చర్యపోయేలా చేశామని చెప్పారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన.. ‘స్వర్ణకుప్పం’ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేను వచ్చిన తర్వాత 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి మల్లన్నసాక్షిగా కుప్పం కన్గొంది వరకు నీళ్లు తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే.
660 కిలోమీటర్లు ఎన్నో లిఫ్టులు.. ఆచరణ సాధ్యం కాదనుకున్నారు. కానీ, నేను వారినే ఆశ్చర్చపోయే పరిస్థితికి తీసుకొచ్చాను’ అంటూ గొప్పగా చెప్పుకొన్నారు. ‘పోయిన సంవత్సరం నీళ్లు తీసుకొచ్చాం. 133 ట్యాంకులకు నీళ్లు అందించే పరిస్థితికి వచ్చాం. 7,663 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. రెండు టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి.. భూగర్భ జలాలు పెంచాం. వ్యవసాయ విస్తీర్ణం డబుల్ అయింది. 8,500 ఎకరాల నుంచి 15,550 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
