హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 26 : పండుగ పూట ప్రజలు పరేషాన్ అవుతున్నారు. సొంతూళ్లు, బంధువుల ఇండ్లకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. హనుమకొండ బస్‌స్టేషన్‌లో సరిపడా బస్సులు లేక.. ఉన్నవి సరిపోక ఇబ్బందిపడుతున్నారు. బతుకమ్మ, దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నా అవి ఎటూ సరిపోవడం లేదు. పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు హనుమకొండ బస్‌స్టేషన్‌కు భారీగా తరలివస్తుండడంతో ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది
పడుతున్నారు.
తొమ్మిది డిపోలకు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచే బస్సులు వెళ్తాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా బస్సులు లేకపోవడంతో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అరగంట నుంచి గంటపాటు ఎదురుచూడాల్సిన వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపా, దడపా వచ్చిన బస్సులు ఎక్కేందుకు, సీట్లు దొరకబుచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా హనుమకొండ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సరిపడా బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ కంట్రోలర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు బస్సుల రాకపోకలను చూస్తున్నారు. పండుగ సందర్భంగా ఉప్పల్‌కు వెయ్యి అదనపు బస్సులను నడిపిస్తున్నాం. హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది.
– ఆర్ఎం డీ విజయభాను
హనుమకొండ బస్‌స్టేషన్‌లో దసరా పండుగ సందడి నెలకొంది. ఇసుకేస్తే రాలన్నంతగా జనంతో బస్‌స్టేషన్ నిండిపోయింది. ఆర్టీసీ అధికారులు పండుగ దృష్ట్యా అదనపు బస్సు సర్వీసులను ప్రారంభించారు. సొంతూళ్లకు వెళ్లడానికి ప్రయాణికులు ఆర్టీసీ బస్లపైనే ఆసక్తి చూపడడంతో రద్దీ పెరిగిపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంతో బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌కు 1284 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచి రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీస్‌లను తిప్పుతున్నా అవి సరిపోకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫ్రీ బస్సు తీసుకొచ్చి పండుగపూట సీట్ల కోసం లొల్లి పెట్టుకుంటూ పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహాలక్ష్మీ పథకంపై మహిళలు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. బస్సులు సరిపోక ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. బస్సు దొరికినప్పటికీ సీట్ల కోసం మహిళల లొల్లి మాత్రం కొనసాగుతూనే ఉన్నది.