నర్సంపేట, జనవరి 7 : నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ. 300 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. నియోజకవర్గంలో రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, బీటీ, సీసీరోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, వీవో భవనాలు, బ్రిడ్జీలు తదితర పనులకు, దళితబంధు, బీసీబంధు, ఇళ్ల నిర్మాణాలకు జీవోలు తీసుకొచ్చి నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కలెక్టర్ ఖాతా ల్లో నిధులు కూడా జమ చేసిందన్నారు. కొ న్ని పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు. మరికొన్ని పనులు మధ్యలో ఉన్న ట్లు వెల్లడించారు. వీటన్నింటినీ ఆపాలని కాంగ్రెస్ సర్కారు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. నర్సంపేట డివిజన్లో దళితబంధు 1100, బీసీ బంధు 289 మందికి చెక్కులు వచ్చి ఉన్నట్లు స్పష్టం చేశా రు. గృహలక్ష్మీ పథకంలో 2783 మందికి రూ. 3 లక్షల చొప్పున మంజూరు పత్రాలు అందజేశామన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇళ్ల నిర్మాణాలను ఆపాలని ఏకపక్షంగా జీవోలు తెచ్చిందని ఎద్దేవా చేశారు.
ఎస్డీఎఫ్ గ్రాంటు కింద జీవోలు 369, 384, 452, 822 ద్వారా రూ. 44 కోట్లతో కల్వర్టులు, మసీదులు, చర్చీల మరమ్మతులను రద్దు చేసి లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టిందని పెద్ది ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 242, ఆర్అండ్బీ నుంచి 260, పీఆర్ నుంచి 517 జీవో ద్వారా సీసీ, తారురోడ్లకు సంబంధించి రూ. 113 కోట్ల పనులను ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నర్సంపేటకు పైలట్ ప్రాజెక్టు కింద రూ. 75 కోట్లు వెచ్చించి సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించడానికి జీవోను తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే రూ. 16కోట్ల నిధులు ఖర్చయ్యాయని, మిగిలిన రూ. 59 కోట్ల నిధులు వెనక్కి పోవడం దురదృష్టకరమన్నారు. సంక్షేమ, అధివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తే ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తామని పెద్ది కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు. సమావేశంలో వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు నామాల సత్యనారాయణ, బానోత్ సారంగపాణి, సుకినె రాజేశ్వర్‌రావు, సంగని సూరయ్య, తిరుపతి, బాల్నె వెంకన్న, బండి రమేశ్, ఎంపీపీలు వేములపెల్లి ప్రకాశ్‌రావు, రమేశ్, సునీత, పద్మనాభరెడ్డి, జడ్పీటీసీలు బానోత్ పత్తినాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.