మూడు రోజులుగా కురుస్తున్న వర్షం పంటలకు ఊపిరి పోసింది. ఈ సీజన్లోనే ఇవి భారీ వానలు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెట్ట, వాణిజ్య పంటలకు ప్రాణం వచ్చింది. తొలకరి పలకరించగానే ఎప్పటిలాగే రైతులు పంటలు వేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు మోస్తరు వాన కురవడంతో చెరువుల్లోకి నీరు చేరలేదు. బోర్లు, బావుల్లో నీటిమట్టం పెరగలేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా జరగకపోవడంతో పూర్తిస్థాయిలో పంటల సాగు జరగలేదు.
ఈ నేపథ్యంలో పంటలకు సరిపడా నీరు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఇటీవల కురిసిన వానలతో పరిస్థితి కొంతమేర మెరుగుపడగా, వరి నాట్లు ఊపందుకున్నాయి. కాగా, ఒక్క జనగామ జిల్లాలో తప్ప వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
– వరంగల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సాగు సీజన్ మొదలైన జూన్ 1 నుంచి గురువారం వరకు ములుగు జిల్లాలో 50 శాతం, జయశంకర్ భూపాలపల్ల్లిలో 37, వరంగల్‌లో 23, మహబూబాబాద్‌లో 16, హనుమకొండ జిల్లాలో 10 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జనగామ జిల్లాలో సాధారణం కంటే 2 శాతం తక్కువ వాన కురిసింది. మొదట్లో వానలు లేక వరి సాగుకు ఇబ్బందులెదురైనప్పటికీ ప్రస్తుత వర్షాలతో నాట్లు ఊపందుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వానకాలం పత్తి, వరి ప్రధాన పంటలుగా ఉంటున్నాయి.
ప్రస్తుతం ఈ పంటల విస్తీర్ణమే ఎక్కువగా ఉంది. కాల్వల్లో నీళ్లు రాకపోవడంతో ఆలస్యమైన వరి నాట్లు ఈ నెలాఖరు వరకు కొనసాగే పరిస్థితి ఉన్నది. ఈ సీజన్లో కాల్వల్లో నీళ్లు రాక, వానలు ఆశించిన మేరకు కురవక, చెరువుల్లోకి నీరు చేరక బావులు, బోర్లలో నీటి మట్టం పెరగలేదు. దీంతో వరి సాగు ఆలస్యం కాగా, నాట్లు వేసిన తర్వాత వానలు పడకపోతే పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నుంచి సాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.