వరంగల్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది. ఇందులో భాగంగా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు వరంగల్, రేపు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు ఉండగా ఆయా సెగ్మెంట్ల ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేయనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం వరంగల్ లోక్సభ సెగ్మెంట్ ముఖ్యనేతలతో, గురువారం మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధి నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిసెంట్ కేటీఆర్ సమీక్షలు నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మేయర్, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమం, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్యనాయకులు హాజరుకానున్నారు. మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్ సమావేశంలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలు పాల్గొంటారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షతోపాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై శ్రేణులకు వివరించనున్నారు. లోక్సభ సెగ్మెంట్ సమావేశాలకు సన్నాహకంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు డివిజన్లు, మండలాల వారీగా ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్లు మొదటి నుంచీ బీఆర్ఎస్కు బలమైన స్థానాలుగా ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి రెండు స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ పార్టీ విజయం సాధించింది. వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో 2014 ఎన్నికల్లో కడియం శ్రీహరి, 2015 (ఉప ఎన్నిక), 2019 ఎన్నికల్లో పసునూరి దయాకర్ బీఆర్ఎస్ అభ్యర్థులుగా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మహబూబాబాద్లోనూ భారీ ఆధిక్యతతో బీఆర్ఎస్ అభ్యర్థులు వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచారు. ఈ సెగ్మెంట్లో 2014 ఎన్నికల్లో అజ్మీరా సీతారాంనాయక్, 2019లో మాలోత్ కవిత ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్కు మొదటి నుంచీ కంచుకోటలుగా ఉన్న ఈ సెగ్మెంట్లలో మరోసారి సత్తా చాటేందుకు గులాబీ పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందుకు అనుగుణంగా లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మన హక్కుల గురించి పోరాడే వీలు కలుగుతుందని స్పష్టం చేస్తున్నది. ఇప్పటివరకు పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్, బీజేపీ ఎంపీల కంటే బీఆర్ఎస్ ఎంపీలు సంధించిన ప్రశ్నలే అధికమని, బీఆర్ఎస్ ఎంపీల వల్లే కేంద్రం నుంచి పలు కీలక పనులను సాధించుకోగలిగామని పేర్కొంటున్నది.