జనగామ, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఔటర్‌రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఇతర అభివృద్ధి పనులకు రూ.6,500 కోట్లు మంజూరు చేసి హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శివునిపల్లి వద్ద వర్చువల్‌గా ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి అనంతరం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రజాపాలన బహిరంగసభలో మాట్లాడారు.
అంతకుముందు ఇందిరా మహిళా శక్తి స్టాల్స్‌ను సందర్శించి బస్సులను ప్రారంభించి ఎస్‌హెచ్‌జీ మహిళలకు బ్యాంక్ లింకేజీ చెక్కులను జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎందరో ఉద్యమకారులకు, వీరులకు, మేధావులకు పుట్టినిల్ల్లు అయిన ఓరుగల్లుకు గొప్ప చరిత్ర ఉన్నదని తెలంగాణకు వెన్నుదన్నుగా నిలిచిన వరంగల్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు. అందుకే అభివృద్ధిలో హైదరాబాద్‌తో పోటీపడేలా వరంగల్ దూసుకుపోతున్నదని, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ మామునూరుకు ఎయిర్‌పోర్టు తీసుకువచ్చామన్నారు.
జయశంకర్ సార్ ఊరిని తాను వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామంగా చేశానని తెలిపారు. బకాయిలు రూ.8 లక్షల 29వేల కోట్లు అయితే అసలు, మిత్తి కలిపి రూ.లక్షా 53వేల కోట్లు చెల్లించిన పరిస్థితి వచ్చిందని.. ఈ డబ్బులు ప్రభుత్వం వద్ద ఉంటే ఇల్లు లేని పేదవాడే లేకుండా అందరికీ ఇండ్లు కట్టించవచ్చని, మరో 70లక్షల మందికి రైతు రుణమాఫీ చేయొచ్చు అని సీఎం వ్యాఖ్యానించారు. బడ్జెట్, ఆదాయం తగ్గి ప్రజలకు మంచి చేయడంలో కాస్త వెనుకబడ్డామని.. ఎన్ని కష్టాలున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్ని వర్గాలకు సంక్షేమం అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మన భవిష్యత్ తరాల కోసం పునర్నిర్మాణం చేసుకుందామని అందరూ అండగా నిలబడాలని కోరారు.