పరకాల, అక్టోబర్ 6 : తెలంగాణ ఆడపడుచులకు అతి పెద్దదైన బతకమ్మ పండుగలో ప్రస్తుతం నాటి వైభవం కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పూర్వ స్థితిని సంతరించుకున్న పూల పండుగ నేడు అస్థిత్వం కోసం పోరాడాల్సి వస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడే వారు. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలపై చిన్నచూపు చూస్తున్నది. ఆడబిడ్డలు ఆడుకోవడానికి కనీస ఏర్పాట్లు కూడా చేయని దుస్థితి నెలకొంది. బతుకమ్మ కానుకలు రాక.. ఇస్తామన్న రూ. 500 ఇవ్వక మహిళలు డీలా పడిపోతున్నారు. కాంగ్రెస్ సర్కారు తీరుతో సంబురంగా బతుకమ్మ ఆడుకునే పరిస్థితి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఊరూరా ఉత్సవాలను ఘనంగా చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. దీంతో గ్రామంలో వీధిలైట్ల ఏర్పాటుతో పాటు బతుకమ్మ ఆడే, నిమజ్జనం చేసే ప్రాంతాన్ని చదును చేసి విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆడబిడ్డల ఆటపాటలతో సందడిగా మారేది.
బతుకమ్మ పండుగ ప్రారంభమైన నాటి నుంచే గ్రామాల్లో వాడవాడలా సందడితో ఉండాల్సిన పల్లెలు నేడు వెలవెల బోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా జరుగుతున్న బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారని ఆశపడ్డ మహిళలకు అడియాసే మిగిలింది. గ్రామాల్లో బతుకమ్మ ఆట స్థలాల వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పండుగకు వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరిగిన నేపథ్యం నుంచి మూడు రోజుల ముందే హడావుడి చేసే దుస్థితికి దిగజారింది.
సద్దుల బతుకమ్మ ఆడే, నిమజ్జనం చేసే ప్రాంతాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్నిచోట్ల స్థలాన్ని చదును చేయకపోవడంతో పాటు విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు చేసినా నిమజ్జనానికి మహిళలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. పరకాల పట్టణంలోని మహిళలు పశువుల సంతలో బతుకమ్మ ఆడుకొని పక్కనే ఉన్న దామెర చెరువులో నిమజ్జనం చేస్తారు. అయితే సంతలో కేవలం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దామెర చెరువు ఘాట్ వద్ద మరికొన్ని మెట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసినా నిమజ్జనానికి ఇబ్బందిగా ఉన్నాయి. అవి అలాగే చెరువులోని పిచ్చి చెట్లను తొలగించలేదు.
బతుకమ్మ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అంటే మహిళలను అవమానపరిచినట్లే. కేసీఆర్ ప్రభుత్వం ఏటా కానుకలను అందించి మహిళలను గుర్తించింది. కానీ కాంగ్రెస్ సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి కానుకలు అందించలేదు. ఈ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు ఆదరణ తగ్గుతున్నది.
– బండి శ్రావణి, పరకాల
నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న బతుకమ్మ సంబురం ఇప్పుడు లేదు. బతుకమ్మ పండుగ వస్తుందంటనే గ్రామాల్లో సందడి నెలకొనేది. వీధి దీపాల ఏర్పాటు ముందుగానే జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా జరగడం లేదు. సగం పండుగ రోజులు పూర్తయ్యాక ఇప్పుడు వీధి దీపాల ఏర్పాటు జరుగుతున్నది. చెరువులు, బతుకమ్మ ఆడే ప్రాంతాల వద్ద ఏర్పాట్లు చేస్తలేరు.
– ఆముదాలపల్లి అనురాధ, లక్ష్మీపురం