జనగామ చౌరస్తా, అక్టోబర్ 15 : ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ నాయకులు మాట్లాడుతూ.. గత మార్చి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడం దారుణమని తెలిపారు.
పెన్షనర్లను ప్రభుత్వం వేధించడంతో పాటు వారిని తీవ్ర అనారోగ్యానికి గురిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు బందారపు లక్ష్మయ్య, అంబటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.