Low Carb Diet | ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మీద స్పృహ రావడంతో చాలా మంది కార్బొహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించారని చెప్పవచ్చు. తక్కువ కార్బ్ లేదా నో కార్బ్ డైట్ లను పాటిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, వ్యాయామాలు చేసే వారు ఇటువంటి డైట్ పద్దతులను ఎక్కువగా అనుసరిస్తున్నారు. తక్కువ కార్బొహైడ్రేట్ లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. కార్బొహైడ్రేట్ లను తక్కువగా తీసుకోవడం వల్ల ఫలితాలు ఉన్నప్పటికీ దీనిని సరైన పద్దతిలో సమతుల్యంగా పాటించకపోతే ప్రమాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు మేలు కలుగుతుందా.. లేదా.. అలాగే తక్కువ కార్బ్ డైట్ ను పాటించడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి వైద్యులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కల ఆధారిత ఆహారాలు, తృణ ధాన్యాలు, అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు, తక్కువ కార్బ్ లను తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని వైద్యులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. గుండె ధమనుల్లో ప్లేక్ కొవ్వు నిల్వలు పేరుకుపోయి గుండె కండరాలకు ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని సరఫరా చేయకుండా ఆపేయడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ వస్తుంది. గుండెకు ఆకస్మాత్తుగా రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల ఛాతి నొప్పి, గుండెపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శుద్ది చేసిన కార్బొహైడ్రేట్స్, జంతుఆధారిత కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆహారంలో తక్కువ కార్బొహైడ్రేట్లను తీసుకునే ప్రయత్నం చేయాలి. తక్కువ కార్బ్ లేదా నో కార్బ్ డైట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ భారతీయ భోజనం అధిక కార్బొహైడ్రేట్స్ కు ప్రసిద్ది చెందింది. అన్నం, చపాతీ వంటివి లేకుండా భోజనం ఉండనే ఉండదు.
బరువు తగ్గాలనుకునే వారు చేసే తక్కువ కార్బ్ లేదా నో కార్బ్ డైట్స్ స్థిరంగా ఉండవని చెప్పవచ్చు. కార్బొహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించడం వల్ల భోజనం బోరింగ్ గా ఉండడంతో పాటు ఈ డైట్స్ ను దీర్ఘకాలం పాటు పాటించడం చాలా కష్టతరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది అలసట, తలనొప్పి, మానసిక స్థితిలో మార్పులు రావడం, జీర్ణ సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కార్బొహైడ్రేట్స్ ను తీసుకోవడం తగ్గించడం వల్ల వ్యాయామం లేదా రోజువారి కార్యకలాపాల సమయంలో కూడా బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ డైట్స్ ను పాటించడం వల్ల బరువు తగ్గినప్పటికీ వీటిని దీర్ఘకాలం పాటు పాటించడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన కార్బొహైడ్రేట్స్ ను తక్కువ మొత్తంలో తీసుకుంటూ, ప్రోటీన్, కొవ్వులు ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల శక్తి లభించడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇక తక్కువ కార్బ్ లేదా నో కార్బ్ డైట్స్ చేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరం చక్కెరకు బదులు కొవ్వును కరిగిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అయితే ఈ డైట్స్ ను పాటించడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్దకం, అలసట, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. దీర్ఘకాలం పాటు ఈ డైట్స్ ను పాటించడం వల్ల పోషక లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలు బలహీనంగా మారడంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. తక్కువ కార్బ్ లేదా నో కార్బ్ డైట్స్ మంచివే అయినప్పటికీ వీటిని దీర్ఘకాలం పాటు పాటించడం కష్టం కనుక ఆరోగ్యకరమైన కార్బొహైడ్రేట్స్ తో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.