Mahabubabad | నెల్లికుదురు, జూన్ 14 : గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాజుల కొత్తపల్లి, రావిరాల గ్రామాలలో తెగిన చెరువు కట్టలకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌తో మండల కేంద్రం నెల్లికుదురులోని అంబేద్కర్ సెంటర్లో శనివారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు కట్టలు తెగి 9 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు కట్టలకు మరమ్మతులు చేపట్టలేదని దీంతో రైతులు మూడు పంటలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెగిన చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రావిరాల చెరువు కట్ట కింద 400 ఎకరాలు, రాజోల కొత్త పెళ్లి చెరువు కట్ట కింద 800 ఎకరాలు, మొత్తం 12 ఎకరాలు గత వానకాలం ఈ యాసంగి బీడు వారి ఉన్నాయని ఒకట్రెండు రోజుల్లో వర్షాకాలం సీజన్ వస్తున్నప్పటికీ కట్టలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ ఏడాది కూడా సంబంధిత గ్రామాల్లో వ్యవసాయ భూములు బీడువారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే మరమ్మతు పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెరుమాండ్ల బాబుగౌడ్, తోట యాకన్న, తోట నరసయ్య, బాణాల కన్నా, పెరుమాండ్ల పుల్లయ్య, పూజా బిక్షపతి, ఐలేష్, రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.