కాజీపేట, మే 12: కాజీపేట పట్టణంలో రోడ్డుకు ఇరుపక్కల ఫుట్ పాత్ ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సోమవారం తొలగించారు. కాజీపేట పట్టణంలోని చౌరస్తా నుంచి బాపూజీ నగర్ కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు కు ఇరువైపులా ఫుట్ పాత్ లను ఆక్రమించుకుని చిరు వ్యాపారులు చేసుకుంటున్నారు. పలువురు దుకాణాల ముందు రేకుల షెడ్డులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోడ్డు మీదుగా నిత్యం వాహనాల రాకపోకల రద్దీ విపరీతంగా ఉంటుంది.
దీంతో విక్రయదారులు తమ వాహనాలను ఇష్టా రాజ్యాంగ రోడ్డుపై నిలపడంతో రోడ్డంతా ఇరుకుగా మారి రాకపోకలు సాగించే వాహన దారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాలతో మున్సిపల్ టౌన్ ఏసీపీ రజిత నేతృతంలో సిబ్బంది రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లను ఆక్రమణకు గురైన వాటిని తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీపీఎస్ వెంకటరమణ, రోజారెడ్డి తదితర అధికారులతో పాటు మున్సిపల్ డీఆర్ఎఫ్ బృందం పాల్గొన్నారు.