రాయపర్తి, జూన్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్ అధ్యక్షతన జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కారు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలోని ప్రజలంతా గత రెండేళ్లుగా విసిగిపోతున్నారన్నారు. సీఎంకు, ఇతర మంత్రులకు సఖ్యత లేదని, పూటకో మాట, గడియకో నిర్ణయంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, వారంతా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, గ్రామాల్లో గులాబీ శ్రేణులకు అపూర్వ ఆదరణ లభిస్తున్నదన్నారు. కాగా, మండలంలోని మైలారం గ్రామ శివారు చక్రుతండాకు చెందిన రాయపర్తి మాజీ ఎంపీపీ గుగులోత్ విజయానామానాయక్ సహా మండలంలోని చక్రుతండా, గన్నారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజిడి గజేందర్‌రెడ్డి, అయిత ప్రవీణ్‌కుమార్, పాడిచర్ల రాకేశ్‌తోపాటు సుమారు 25 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎర్రబెల్లి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల కన్వీనర్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, లేతాకుల రంగారెడ్డి, గారె నర్సయ్య, లేతాకుల మధుకర్‌రెడ్డి, సంది అమ్మిరెడ్డి, బెల్లి పెద్దాపురం, కుక్కల భాస్కర్, ఉల్లెంగుల సుధాకర్, గుగులోత్ చాంద్‌నాయక్, తాళ్లపల్లి సంతోష్‌గౌడ్, మహ్మద్ ఆశ్రఫ్పాషా, అక్బర్, అయిత రాంచందర్, చందు, రామ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా అనుచిత పోస్టింగ్‌లు పెట్టిన మహాన్యూస్ చానల్‌పై మాజీ మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంతో తెలంగాణపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతున్నదని, చానల్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం సమంజసమేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఓ బ్రాండని, వారిపై ఈగ వాలితే మహాన్యూస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గతంలో ఇలాంటి కుట్రలతోనే ప్రత్యేక రాష్ర్టాన్ని అడ్డుకున్నారని, తెలంగాణలో బీఆర్ఎస్ను అణగదొక్కాలనుకునే పార్టీలు కోకొల్లలన్నారు.
మరోవైపు పాలనలో పూర్తిగా ఫెయిలైన రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ పేరుతో పనిలేని కమిషన్లు వేస్తూ నాటకాలాడుతున్నదన్నారు. ఏ చానలైనా నిరాధార అరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఈ వ్యవహారాన్ని పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా బీఆర్ఎస్ భావిస్తున్నదన్నారు. జర్నలిజం నైతికతను దెబ్బతీసేలా కేటీఆర్‌పై పోస్టింగులు పెట్టిన మహాన్యూస్ చానల్ ఏం సాధించాలని, ఎవరి మెప్పు పొందాలని ఈ వ్యవహారం నడిపిందో ప్రజలకు తెలుసని ఎర్రబెల్లి అన్నారు.