చెన్నారావుపేట : అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే ఒక్క గాలివానతో రైతుల కష్టం నేలపాలయింది. మండల వ్యాప్తంగా బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికందిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అరబోయగా గురువారం ఉదయం కురిసిన వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ చాలామంది రైతుల ధాన్యం తడిసినట్లు రైతులు తెలిపారు. తిమ్మ రాయన పాడు గ్రామంలో కురిసిన అకాల వర్షానికి దాన్యం రాశులపై కవర్లు కప్పినప్పటికి ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. కవర్లపై నిలిచిన నీటిని రైతులు తొలగించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండవీటి ప్రదీప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.