ములుగు : అకాల వర్షాలతో అన్నదాతలు( Farmers ) నిండ మునిగిపోతున్నారు. ఇప్పటికే అప్పుల బాధతో సతమతమవుతున్న రైతులు అకాల వర్షాలతో తీవ్రంగానష్టపోతున్నారు. ప్రభుత్వం సహకారం లేకపోవడంతో పాటు ప్రకృతి కన్నెర్ర చేస్తుండడం కలవరపాటుకు గురిచేస్తుంది.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో వడగండ్ల వాన, ఈదురుగాలులు ( Gusty winds ) బీభత్సవాన్ని సృష్టిస్తున్నాయి. చేతికందిన పంట నీటిలో కొట్టుకుపోవడం, చెట్లపై ఉన్న మామిడి, చింత తదితర పంటు నేలరాలి కర్షకులకు కంటనీరు తెప్పిస్తున్నాయి.
ములుగు( Mulugu) జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాలలో
భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల స్వల్పంగా వడగండ్లు పడ్డాయి. కొనుగోలు కేంద్రాల కల్లాల్లో తడిసిన ధాన్యంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.