వరంగల్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్( Central budget) సంపన్నులకు దోచిపెట్టే విధంగా ఉందని ప్రజా సంఘాల నేతలు(Public organizations) మండిపడ్డారు. బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గన్నార రమేష్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ ఏఐసిటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్రా ప్రతాప్, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు, కర్షకులకు, ప్రజలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందో అర్థమవుతుందని విమర్శించారు.
దేశ సంపదనంతా దోచి పెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా పేదరికం, నిరుద్యోగం సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ బడ్జెట్‌ను వ్యతిరేకించాలని కోరారు. కార్మిక వర్గాన్ని నట్టేట ముంచుతూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మతోన్మాద ఆర్థిక దివాలా కోరు తనానికి నిదర్శనమని విమర్శించారు.
ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని తీవ్ర నష్టం చేసిందని ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు తేవడంలో పూర్తిగా బిజెపి ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారన్నారు. తక్షణమే కార్మిక కర్షక వ్యతిరేకమైన బడ్జెట్‌ను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మాలోత్ సాగర్, ఏఐటిసియు జిల్లా అధ్యక్షులు చెన్నకేశవులు, జాన్ పాల్, రైతు సంఘం నాయకులు బాలరాజు, ఐత నగేష్, ఎగ్గే మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అంకటి శ్యాం, తదితరులు పాల్గొన్నారు.