Adani Group | బయ్యారం స్టీల్ ప్లాంట్ తెలంగాణ ప్రజల చిరకాలవాంఛ. విభజన చట్టంలో పొందుపర్చిన చట్టబద్ధమైన హామీ. ఎన్నటికైనా పరిశ్రమ రాకపోతుందా.. ఉద్యోగాలు రాకపోతాయా..అని ఇక్కడి యువత తొమ్మిదేళ్లుగా నిరీక్షిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఉన్న కొద్దిపాటి ఆశలపై నీళ్లు చల్లింది. బయ్యారం ఇనుప ధాతువులో నాణ్యత లేదని ప్లాంటు ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం కుంటిసాకులు చెప్పడంతో, సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనులను బయ్యారానికి కేటాయించి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే రైలుమార్గం ఏర్పాటుకయ్యే ఖర్చును భరిస్తామని రాష్ట్ర సర్కారు పలుమార్లు లేఖలు రాసింది. అయినా, మోదీ ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేకపోగా, ఇప్పుడు ఎక్కడో 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రాకు బైలడిల్లా గనులను కేటాయించి, కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారాన్ని గొయ్యిలో పాతేసింది. తన అనుచరుడు అదానీ కోసమే ఇక్కడి యువతను బలి చేశారని ప్రధానిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బయ్యారం, ఫిబ్రవరి 20 : తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం వివక్ష మరోసారి రుజువైంది. అత్యంత సమీపంలోని బైలడిల్లా గనులను బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్‌కు తరలించేందుకు నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. ఇనుప ఖనిజం నిక్షేపాల ఆధారంగా ఏపీ పునర్విభజన చట్టంలో 36 వేల కోట్లతో ప్రభుత్వరంగంలో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేలా నాడు కేంద్రం హామీ ఇచ్చింది. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సరిపడినంత ఇనుప ఖనిజం లేదని కుంటి సాకులు చెబుతున్నది.
ఈ నేపధ్యంలో సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనులను బయ్యారానికి కేటాయించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని 2015 నవంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇందుకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని, దీనికయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంగా లేఖలో పేర్కొంది. అయినా రాష్ట్ర ప్రభుత్వ వినతిని తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం ఇనుప ఖనిజం గనులు లేని ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించేందుకు పూనుకుంది. అంతేకాకుండా అక్కడే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నది.
అదానీకి కట్టబెట్టేందుకే బయ్యారం బలి..
ప్రధానమంత్రి మోదీకి అత్యంత ఆప్తుడైన అదానీకి బైలడిల్లా గనులను కట్టబెట్టి బయ్యారాన్ని కేంద్ర ప్రభుత్వం బలి చేస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు బైలడిల్లా నుంచే ఇనుప ఖనిజాన్ని రవాణా చేస్తున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఇనుప ఖనిజమున్న బైలడిల్లా ప్రాతం కేవలం బయ్యారానికి 180 కిలోమీటర్ల సమీపంలోనే ఉంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి బైలడిల్లా ఖనిజాన్ని బయ్యారం సరఫరా చేస్తే రవాణా ఖర్చు తగ్గుతుంది.
కానీ కేంద్ర ప్రభుత్వం 1800 కిలోమీటర్ల దూరంలోని గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రాకు తరలించేందుకు సన్నాహాలు చేయడంపై ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.37,500 కోట్లతో పోక్సో , అదానీ గ్రూపు కంపెనీలు కలిసి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనం. ఇనుప ఖనిజం లేని గుజరాత్‌కు ఉక్కును తరలించి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి మోదీ ఆపారమైన ఖనిజ సంపద ఉన్న బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా స్వలాభం కోసం బయ్యారాన్ని బలి చేశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తవుతున్నాయి.
కేంద్రం తీరుపై ప్రజల ఆగ్రహం..
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతున్న కేంద్రం మనకు రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నది. బయ్యారంలో నాణ్యమైన, ఆపార ఇనుప ఖరిజం ఉన్నా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా బైలడిల్లా గనులను కేటాయించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేస్తున్నారు.
ముంద్రాకు తరలించడం అన్యాయం..
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బైలడిల్లాలోని ఇనుప ఖనిజాన్ని గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రాకు తరలించడం అన్యాయం. బైలడిల్లా గనులు బయ్యారానికి కేటాయించి స్టీల్ ప్లాట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుతం గతంలోనే కోరింది. ఇలా చేస్తే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ పెడచెవిన పెట్టిన కేంద్రం బైలడిల్లా గనులు అదానీకి చెందిన కంపెనీకి కేటాయిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుని మరోమారు తన పక్షపాత దోరణిచాటుకుంది. -మూల మధుకర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ , బయ్యారం
వివక్షతోనే ఉక్కు పరిశ్రమకు మోకాలడ్డు..
తెలంగాణపై వివక్ష కారణంగానే కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మోకాలొడ్డుతున్నది. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. బైలడిల్లా గనులను పోస్కో, అదానీకి చెందిన కంపెనీలకు కేటాయిస్తూ కుదురుర్చకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి. లేకుంటే ప్రజలు పోరాటం చేస్తారు.
-తాతా గణేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, బయ్యారం