అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం
బీహార్ లో ఇష్టారీతిన తెలంగాణ ప్రజల సొమ్ము హుష్కాకి
రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారు
బిజెపి సిద్దిపేట జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్
Telangana | భీమదేవరపల్లి, ఆగస్టు 23: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసిందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రాష్ట్రంలో బడ్జెట్ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు పలుచోట్ల పలు సభల్లో బహిరంగంగా పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ లేదని కట్టు కథలు చెప్పి నమ్మిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి వార్తాపత్రికలకు పెద్ద ఎత్తున యాడ్స్ రాష్ట్ర బడ్జెట్ లోని ఏ నిధుల నుండి ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన వాగ్దానాలన్నీ తెలంగాణలో నెరవేర్చామని చెప్పటం విడ్డూరమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 23 శాతం నుంచి 42 శాతానికి ఓబిసి రిజర్వేషన్లు పెంచామని తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు చెబుతున్నారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. రైతు భరోసా ఎకరానికి రూ. 15000 ఇస్తామని చెప్పి రూ. 12 వేలకే కుదించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నాలుగు పంట ఫసల్లు కాగా రెండు ఫసల్ లకే రైతు భరోసా ఇచ్చారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేస్తున్న మోసాన్ని గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.