బయ్యారం, జూన్ 17 : ఏజెన్సీ చేతిలో మోసపోయిన మహబూబాబాద్ జిల్లావాసి కాంబోడియా దేశంలో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ మాలోత్ కవిత అతడితో ఫోన్లో మాట్లాడి భారత్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన మన్సఫ్ ప్రకాశ్ గత మార్చిలో ఓ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేందుకు వెళ్లాడు. అయితే సదరు ఏజెన్సీ కాంబోడియాకు తీసుకెళ్లగా, అక్కడ సైబర్ నేరగాళ్ల బారిన పడి కొద్దిరోజులు చిత్రహింసలు అనుభవించాడు. ప్రస్తుతం ప్రకాశ్ ఇండియన్ ఎంబసీ ఆధీనంలో ఉన్నాడు. ప్రకాశ్ కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కవిత సోమవారం అతడికి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక ప్రకాశ్‌కు సాయం చేయాలని కాంబోడియాలో ఉన్న తన మిత్రుడు కిరణ్‌రెడ్డిని కోరారు.