వరంగల్ చౌరస్తా, ఆగస్టు 31 : ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని రోగులకు ఆయుర్వేద వైద్యసేవలందిస్తున్న వరంగల్ లేబర్‌కాలనీలోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నాలుగున్నర గంటల పాటు సరఫరా నిలిచిపోవడంతో వైద్యులు చీకట్లోనే వైద్యం అందించారు. శనివారం వారాంతం కావడంతో విద్యుత్ శాఖ అధికారులు నిర్వహణ కోసం కరెంట్‌ను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిపివేశారు.
దీంతో ఆస్పత్రిలో అంధకారం అలుముకోగా, వైద్యులు, ఔట్, ఇన్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆయుర్వేద వైద్యశాలగా గుర్తింపున్న ఆస్పత్రిలో కనీసం జనరేటర్ సౌకర్యం లేదు. విద్యుత్ సమస్యతో రోజు విడిచి రోజు నిర్వహించే శస్త్రచికిత్సలు సైతం నిలిపివేయాల్సి వస్తున్నదని వైద్యులు తెలిపారు. ఈ విషయమూ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా గతంలోనే జనరేటర్ కోసం విన్నవించామని, సోమవారం కలెక్టర్‌ను కలిసి మరోమారు వినతిపత్రం అందిస్తామన్నారు.