ములుగు, నవంబర్12 (నమస్తేతెలంగాణ)/ తాడ్వాయి : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అభివృద్ధితో పాటు మాస్లర్ ప్లాన్ నిర్మాణ పనులను డిసెంబర్ 20వలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజులతో కలిసి ఆయన వనదేవతలను దర్శించుకొని అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మేడారం హరిత హోటల్లో సంబంధిత శాఖల అధికారులతో జాతర అభివృద్ధి పురోగతి, మాస్టర్‌ప్లాన్ పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా క్యూ షెడ్లు, నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ, గద్దెల వరకు భక్తుల సామర్థ్యం 3 వేల నుంచి 10వేల వరకు పెంచాలని అన్నారు. 19 ఎకరాల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మల్లంపల్లి, కటాక్షపురం వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులను డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో 10 కోట్ల మంది భక్తులకు సరిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ మేడారం మహా జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని అన్నారు.
ఇందుకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. గిరిజన సంప్రదాయం ప్రకారం గద్దెల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, దేవుళ్ల వద్ద రాజకీయాలు చేయకుండా దైవ కార్యానికి అందరూ సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హరీశ్, కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ పీ శబరీశ్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్‌జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్‌రావు, ఆర్డీవో వెంకటేశ్ ఉన్నారు.