మరిపెడ/డోర్నకల్, జూలై 18 : సకాలంలో వర్షాలు పడక చెరువులు, కుంటలు నిండకపోవడంతో వాటి పరిధిలోని వందల ఎకరాల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అడపా దడపా కురిసిన వర్షాలకు తోడు బోర్లు, బావుల కింద పోసిన వరి నార్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితులతో బోర్లు, బావులు అడుగంటిపోయి పొలాల్లో నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. వానలు పడతాయనే ఆశతో నాట్లు వేసిన కొందరు రైతులు ఇప్పుడు నీరందక అష్టకష్టాలు పడుతున్నారు. అలాగే వేసవిని తలిపిస్తున్న ఎండలు, వీస్తున్న వేడిగాలులతో మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అక్కడక్కడా సాగుచేసిన పత్తి, ఇతర ఆరు తడి, కూరగాయల పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా గోదావరి జలాలు తమ పొలాల్లో పారుతాయని తలచిన అన్నదాతలు.. కాంగ్రెస్ సర్కారు నీళ్లెత్తిపోయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం తాము పడరాని పాట్లు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినా కనీస చర్యలు చేపట్టలేదని మండిపడుతున్నారు. దీంతో తాము పంటలు పండించే పరిస్థితి లేకుండాపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగు నీరందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఈ ఏడాది వర్షాభావంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. మేడిగడ్డను సాకుగా చూపి రైతులకు నీళ్లు అందించకుండా రాజకీయం చేస్తున్నది.
– కృష్ణ గంధసిరి, రైతు, అనేపురం, మరిపెడ
రెండెకరాల వరి సాగు కోసం పొలంల వడ్లు చల్లి. నీళ్లు లేక నారు సరిగా మొలకెత్తలేదు. రెండోసారి కూడా వడ్లు చల్లిన. ఈ సారి వర్షాలు పడ్తయో? లేదో? అని ఆందోళనగా ఉంది. వరుణుడు కరుణిస్తే రైతులు వ్యవసాయం చేసుకుంటరు. బావుల్లో నీళ్లు పూర్తిగా అడుగంటినయ్..
– తాళ్లూరి కిషన్‌రావు, రైతు, తోడేళ్లగూడెం, డోర్నకల్