పోలీసుల బెదిరింపులు, ఆంక్షలు, గృహనిర్బంధాలు అరెస్ట్‌లను ఛేదించుకుని ఉప్పెనలా హైదరాబాద్‌కు తరలిన యువతరం నినాదాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం సరూర్‌నగర్‌లో జరిగిన యువ సంగ్రామ సదస్సుకు నిరుద్యోగులు, విద్యార్థులు ప్రవాహంలా తరలివచ్చారు. ఎన్నికల సందర్భంగా యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తెరపై ప్రదర్శిస్తూ గణాంకాలు, సాక్ష్యాధారాలతో వివరిస్తూ సాగిన కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. రేవంత్ ప్రభుత్వం యువతను వంచించిన వైనాన్ని కేటీఆర్ ఎండగట్టారు. సభలో ప్రసంగించిన యువతరం తాము అనుభవిస్తున్న కన్నీటి కష్టాలను ఏకరువు పెట్టారు. తమను దారుణంగా మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023 మే 8న సరూర్‌నగర్ యువ సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ అధికారంలోకి రాగానే ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఉద్యోగాలు వచ్చేంతవరకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, ఏటా జాబ్ క్యాలెండర్, ప్రైవేట్ రంగంలో 75% యువతకు రిజర్వేషన్, జిల్లాకొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణం, 18 ఏండ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు లేదా పెన్షన్లు ఇస్తామని, విద్యాసంస్థలు నెలకొల్పుతామని 28 హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా వాగ్దానాలేవీ అమలుకాలేదు. ఓపిక నశించిన యువత ఆందోళన బాట పట్టారు.
కాంగ్రెస్ పాలకుల కాకి లెక్కలతో విసిగి వేసారిన నిరుద్యోగులు, యువతీ యువకులు, విద్యార్థుల ఉద్యమాలతో రాష్ట్రం హోరెత్తుతున్నది. హామీలు అమలు చేయాలని కోరుతున్న వారిపై పోలీసుల లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులు, నిర్బంధాలు నిత్యకృత్యమైపోయాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా గత మార్చి 25న అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం వచ్చాక తమకు తాముగా ఇచ్చిన ఉద్యోగాలు 16,798 కాగా, మిగతా 50,785 ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయినట్టు ఒప్పుకొన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఆ రెండింటినీ కలిపి 67,763 ఉద్యోగాలు తామే ఇచ్చినట్టు చెప్పుకోవడం నిరుద్యోగులకు ఆగ్రహం తెప్పించింది. 20వేల పోలీసు ఉద్యోగాలకు కేవలం 5వేలు మాత్రమే భర్తీ చేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరి పట్ల నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో చుట్టూ సమస్యల వలయాలు ఉండేవి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని సమస్య ఓ పక్క, ప్రభుత్వ ఆస్తుల పంపిణీలో పేచీలు, న్యాయస్థానాల్లో వివాదాలు, సవాలక్ష విభజన సమస్యలు, ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలు, ఉద్యోగ నియామకాలకు కూడా ఎన్నో అవరోధాలు మరో పక్క సతమతం చేసేవి. ఉద్యోగుల విభజన పూర్తయితే కానీ ఖాళీలెన్నో తేలని పరిస్థితి.
కొత్తగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. 95% స్థానిక రిజర్వేషన్ల కల్పన కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం 2018 దాకా ఎదురుచూపులు తప్పలేదు. ఆ తర్వాత కరోనా ఉపద్రవం, ఎన్నికలు. వీటన్నిటినీ అధిగమించి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2,32,308 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు అనుమతి లభించగా 2,02,735 ఉద్యోగాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. అందులో1,60,083 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ పూర్తికాగా 42,625 ప్రాసెస్‌లో ఉన్నాయి. ఒక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 60,918 ఉద్యోగాలు ఉండగా 54,015 నోటిఫై చేయడం, 35,250 నియామకాలు పూర్తికాగా 18,765 ఉద్యోగ నియామకాలు ప్రాసెస్‌లో ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 47,068, మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ 694, డీఎస్సీ 2,047 ఇతర ప్రభుత్వ విభాగాల్లో మొత్తంగా 49,132 నియామకాలు జరిగాయి. మరో18,245 ఉద్యోగాలు ప్రాసెస్‌లో ఉన్నాయి.
ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు లక్షల్లో వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు 95% లోకల్ రిజర్వేషన్లు 2018 నుంచి అమల్లోకి వచ్చాయి. 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మారుమూల గ్రామాల వరకు విస్తరించాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ అస్తిత్వ జెండా సగర్వంగా రెపరెపలాడింది. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరాక రెండున్నరేండ్లలో యువతకు అడుగడుగునా అవరోధాలే ఎదురవుతున్నాయి. అందులో ఒకటి ఫీజు రీయింబర్స్మెంట్. ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. లబ్ధిదారులైన లక్షలాది మంది విద్యార్థులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.
పేద, దళిత, బహుజన విద్యార్థులకు ఫీజులు కట్టలేని నిస్సహాయత. సర్టిఫికెట్లు విద్యార్థుల చేతికి అందడంలేదు. క్యాంపస్ రిక్రూట్మెంట్ సహా ఇతరత్రా వచ్చిన ఉద్యోగావకాశాలు కండ్ల ముందే చేజారి పోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పేరుకుపోయిన ఫలితంగా సంబంధిత కళాశాలలు సంక్షోభంలో ఇరుక్కున్నాయి. చెల్లింపులకు న్యాయస్థానం ఇచ్చిన తుది గడువు ఆగస్టు 15 సమీపిస్తున్నది. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. మొక్కుబడిగా ప్రభుత్వం వాయిదాల ప్రకారం చెల్లిస్తానంటున్నది. ఆ లెక్కన ఇప్పుడు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తవడానికి ఎంతకాలం పడుతుందో అంతుపట్టడం లేదు. ఇది ఇలా ఉండగా రాష్ట్రం చెల్లించాల్సిన వాటా కుంటుపడటంతో కేంద్రం ఇచ్చే ఎస్సీ, ఎస్టీ స్కాలర్షిప్లు కూడా డోలాయమానంలో పడ్డాయి.
ఎన్నికలప్పుడు కాలికి బలపం కట్టుకుని కోచింగ్ సెంటర్ల అడ్డాలకు, లైబ్రరీలకు చక్కర్లు కొట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఈ రెండున్నరేండ్లల్లో వాటి దారిదాపుల్లోకే రాలేదు. యూత్ డిక్లరేషన్ ప్రకటించిన ప్రియాంక గాంధీ, నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు నిరుద్యోగుల ఎదుట నిలిచే ధైర్యం చాలక ముఖం చాటేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం, ఉద్యోగ నియామకాల కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం జరుగుతున్న ఆందోళనలతో అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, ధర్నాచౌక్‌లు అట్టుడుకుతున్నాయి.
ఇకనైనా ప్రభుత్వం కండ్లు తెరిచి యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేకపోతే ప్రజాక్షేత్రంలో వారి ఆగ్రహం చవిచూడక తప్పదు. ఆరు దశాబ్దాల తెలంగాణ చరిత్రను సింహావలోకనం చేస్తే నిరుద్యోగుల గుండెల నుంచి ఉద్భవించిన ఎన్నో ఉద్యమాలు సమాజ గతిని మార్చాయి. తెలంగాణ అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాట విత్తనాలు ముందుగా అంకురించింది అక్కడే. యూత్ డిక్లరేషన్ హామీల విషయంలో పాలకులు చెప్పినమాట ప్రకారం వెంటనే చర్యలు ఆచరణలో చూపెట్టాలి. లేకపోతే మరిన్ని పోరాటాల సెగలను ఎదుర్కోకతప్పదు.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 9849893238