కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 18: గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లా ఎస్పీ బిరుదురాజు రోహిత్‌రాజు పోలీస్ అధికారులతో శనివారం తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పుష్కరఘాట్ల వద్ద భక్తుల భద్రత, రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థాలాలు, చెక్‌పోస్టుల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశాలిచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
ఘాట్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాట్లు చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుష్కరాల సమయంలో అన్నిశాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ నిబద్దతగా విధులు నిర్వర్తించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్, పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్‌కుమార్, భద్రాచలం సీఐ నాగరాజు, పాల్వంచ సీఐ సతీష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ చెన్నూరి శ్రీనివాస్, పోలీస్ పీఆర్వో బొల్లి సాయికుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.