కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను కట్టిపడేసింది. కన్నడ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సినిమాలే చేసినా ఫుల్క్రేజ్ను సంపాదించుకున్నది. ‘అమిగోస్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నాగార్జున నటించిన ‘నా సామిరంగ’తో అలరించింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఈ ఏడాది సందడి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లో నటిస్తున్నది. బిగ్ ఆఫర్లతో దూసుకుపోతున్న ఆషికా పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
మాది కర్ణాటక. చదువుతో పాటు నాకు డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో ఫ్రీ స్టయిల్, బెల్లీ, వెస్ట్రన్ నేర్చుకున్నాను. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీ కోసం ఆడిషన్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచాను. అక్కడే డైరెక్టర్ మహేష్ బాబు నన్ను చూశాడు. నా టాలెంట్‌ను గుర్తించి ‘క్రేజీ బాయ్’ సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. మా అక్క కూడా సినీ నటే.
నాకు టాలీవుడ్ కలిసొచ్చిందనే చెప్పాలి. తెలుగులో చేసిన సినిమాలన్నీ మంచి గుర్తింపునే తెచ్చాయి. చిరంజీవి లాంటి అగ్ర హీరోతో నటించడం గొప్ప వరంగా భావిస్తున్నాను. షూటింగ్లో తనతో పనిచేసే ప్రతీ ఆర్టిస్ట్‌ను ఆయన ప్రేమతో పలకరిస్తారు. ఇక తిరువీర్తోనూ ఓ సినిమా చెయబోతున్నాను. దాంతో పాటు తమిళంలో కార్తి ‘సర్దార్-2లో నేనే హీరోయిన్.
విభిన్న పాత్రలు చేసినప్పుడే నటికి తృప్తి కలుగుతుంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నా పాత్ర చాలా యంగ్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ‘నా సామి రంగ’లో నాగార్జునతో కలిసి చాలా పరిణతి ఉన్న పాత్రలో నటించా. నేను భిన్నత్వం కోసం ఆలోచించి నటిస్తాను. నా కో-స్టార్ వయసు విషయం అంతగా పట్టించుకోను. ఆ సమయంలో ఆ పాత్రను మాత్రమే చూస్తాను.
‘పెద్ది’లో జాన్వీ కపూర్ వేషధారణ గురించి తప్పుగా ఓ ఆర్టికల్ ప్రచురిస్తే దానిపై నేను ఆమెకు మద్దతుగా స్పందించాను. హీరోయిన్లను నిందించడం ఆపి, ఇప్పటికీ ఇలాంటి గ్లామర్ పాత్రలకే టికెట్లు తెగుతాయని నమ్ముతున్న సినీ వ్యవస్థను, డైరెక్టర్లను తప్పు పట్టాలి. నటీనటులు ఎప్పుడైనా సరే తమకు అందుబాటులో ఉన్న అవకాశాల పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. పెద్ద ప్రాజెక్ట్‌లలో భాగమైతే ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతామని కోరుకోవడంలో తప్పులేదు.
నిత్యం కొత్తదనం కోరుకోవడం నా అలవాటు. అందుకే ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటాను. ఈ జర్నీలో నేనొక సెలబ్రెటీగా ఎన్నడూ భావించను. రోడ్డు పక్కన సమోసాలు, మ్యాగీ తింటూ సింపుల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడమంటే నాకు ఎంతో ఇష్టం. అభిమానులకు దగ్గర కావడం కోసం సోషల్‌మీడియాలో నా ఆలోచనలు పంచుకుంటాను.
నాకు కాబోయేవాడికి చాలా క్వాలిటీస్ ఉండాలి. ముందుగా నన్ను గౌరవించాలి. నేను నటిని, నటన నా ఫ్యాషన్ కాబట్టి ఆ కెరీర్ కొనసాగించేలా ప్రోత్సహించాలి. కేరింగ్‌గా, లవింగ్‌గా చూసుకోవాలి. నాకు లైట్‌గా ఓసీడీ ఉంది. పరిశుభ్రతకు ప్రాణమిస్తా. ఈ విషయంలో అస్సలు రాజీపడను. ఇలాంటి క్వాలిటీస్ కళ్యాణ్‌రామ్‌లో చూశాను. ‘అమిగోస్’ షూటింగ్లో ఆయన నిత్యం తన భార్య గురించే చెబుతుండేవాడు.