ఓ అవినీతి అధికారికి పొలిటికల్ పలుకుబడి రక్షణగా నిలుస్తున్నది. అతడు అక్రమాలకు పాల్పడింది నిజమేనని తేలినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నది. ఫలితంగా కోట్లల్లో నిధులు దుర్వినియోగం చేసి, పాలనా పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకు న్న సదరు అధికారి జంకు, బొంకు లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు. హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఏడాదిగా ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో కలిసి నిధులను పక్కదారి పట్టించాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలోనూ అక్రమాలకు తెగబడ్డాడు.
నిధుల ఖర్చుకు సంబంధించిన లెక్కలు ఆడిట్ శాఖ తనిఖీల్లోనూ చిక్కకపోవడంతో ఆరోగ్య శాఖ ఆలస్యంగానైనా చర్యలకు ఉపక్రమించింది. తొలుత ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు వేసింది. అధికారి అక్రమాలపై అంతర్గతంగా విచారణ జరిపి అవి నిజమేనంటూ నిర్ధారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిషనర్‌కు నివేదించింది. దీంతో సదరు అధికారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించగా, అంతా అతడికి కలిసి వచ్చింది. మంత్రి ఎంట్రీతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా మీన మేషాలు లెక్కిస్తుండడంతో ప్రస్తుతం ఆ ఫైల్ పక్కన పడింది.
– వరంగల్, డిసెంబరు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య ఉప కేం ద్రాలను అభివృద్ధి చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం ఈ కేంద్రాలు ఆయుష్మా న్ ఆరోగ్య మందిర్లుగా మారాయి. కేంద్రా ల మరమ్మతులు, ఆధునీకరణ, అత్యవసర మందుల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత ్వం తొలిదశలో రూ. 93 లక్షలు విడుదల చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా కీలక అధికారి, మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కలి సి ఈ నిధులను పక్కదారి పట్టించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అకౌంట్లోకి మార్చారు. ఆ తర్వా త నిధుల వినియోగంపై ఎలాంటి లెక్కలు లేవు. ప్రభుత్వ ఆడిట్ శాఖ తనిఖీల్లో నిధులు ఖర్చు చేసినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. ప్రభుత్వ పరంగా ఈ విషయమై చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించారు. అవినీతి ఆరోపణలపై వైద్య, ఆరోగ్య శాఖ అంతర్గతంగా విచారణ జరిపి నిజమేనని నిర్ధారించి అధికారిపై చర్యలకు ప్రతిపాదనలు రాష్ట్ర కమిషనర్‌కు నివేదిక పంపించింది. దీంతో సదరు అధికారి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి దగ్గరికి వెళ్లి అండదండలు కావాలని కోరాడు. ఆ మంత్రి సూచనతో కమిషనర్ కార్యాలయం అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టింది.
వైద్య సేవల కల్పన, మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన అధికారి ఉద్యోగాల భర్తీలోనూ ఇదే రకంగా వ్యవహరించారు. వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో గతంలో పని చేసిన మరో అధికారితో కలిసి ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల కోసం మంజూరైన వాటిలో 81 పోస్టులను అమ్ముకున్నట్లు తెలిసింది.
ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే అర్బన్ హెల్త్ సెంటర్, పల్లె దవాఖానాల్లో 63 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు, 9 డాక్టర్, స్టాఫ్ నర్సు, సపోర్ట్ స్టాఫ్, 5 సపోర్ట్ట్ ఇంజినీర్, 4 ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేయగా, ఈ అంశంపై సైతం విచారణ జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. అయితే అవినీతి అధికారిపై తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ప్రభుత్వంలోని పెద్దలు అడ్డుపడుతుండడంతో ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు.