కృష్ణకాలనీ, జూన్ 12 : సింగరేణి యాజమాన్యం అధికారిక వెబ్సైట్లో శుక్రవారం కేటీకే ఓసి-గనిపై 2.83 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చూపించడంతో భూపాలపల్లిలో సింగరేణి పరిరక్షణ సదస్సునకు హాజరైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు బృందం పరిశీలించడానికి వెళ్లింది. ఇది గమనించిన సింగరేణి భూపాలపల్లి ఏరియా అధికారులు కేటీకే ఓసీ-2 వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులను గని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
అయినా, హరీశ్‌రావు తన బృందంతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, సింగరేణి అధికారులు పర్మిషన్ లేదని బారికేడ్లు పెట్టి పోలీస్ బెటాలియన్‌తో అడ్డగించారు. దీంతో హరీశ్‌రావు సింగరేణి, పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. అరచేతిని అడ్డుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చేస్తున్న వేలాది కోట్ల బొగ్గు సాంను ఆపలేరని హెచ్చరించారు. తమ బీఆర్ఎస్ బృందం ఓసి-2 వద్దకు రాజకీయం చేయడానికి రాలేదని, ఓసి-2పై సింగరేణి అధికారిక వెబ్సైట్ లో 2.83 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని చూపించడంతో, వాటిని పరిశీలించడానికి వచ్చామని, కార్మికుల పనులకు ఆటంకం కలిగించమని, సామరస్యంగా నిల్వ ఉన్న బొగ్గు డంప్‌ను చూసి వెళ్తామన్నారు.
అయినా, పర్మిషన్ లేదని అధికారులు తేల్చి చెప్పడంతో ఆగ్రహించిన హరీశ్‌రావు తమ బృందాన్ని పంపించకుంటే జనాలకు బొగ్గు సాం బరాబర్ జరిగిందని తెలిసిపోతుందన్నారు. తనతో పాటు ఐదుగురిని పంపించండి.. వెళ్లి బొగ్గు నిల్వలు చూసి వస్తామన్నారు. అవసరమైతే ఏరియా జీఎం వద్ద పర్మిషన్ తీసుకోండి.. గంట సేపు ఇకడే ఉంటామని, పర్మిషన్ వచ్చాకే చూసి పోతామని చెప్పినా అధికారులు గని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్మిషన్ కోసం భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఏరియా జీఎం సాంలో భాగంగానే కావాలనే ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని అన్నారు.
మీరిప్పుడు అడ్డుకుంటే శుక్రవారం రాత్రి ఇకడే పడుకొని శనివారం తెల్లవారుజామున బొగ్గు నిల్వలను కచ్చితంగా చూసి పోతానని, ఎంతవరకు ఆపుతారో చూసుకుందామని హెచ్చరిస్తూ హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ నేతలు వెనుదిరిగి వెళ్లిపోయారు. అకడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీశ్‌రావు వెంట మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పుట్ట మధుకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆయా కార్పొరేషన్ల రాష్ట్ర మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి ఉన్నారు.