సుబేదారి, నవంబర్ 18 : సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో నగరంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు బలగాలు మోహరించాయి. లగచర్ల సంఘటనతో పోలీసు ఉన్నత అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర నలమూలల నుంచి పెద్ద సంఖ్యలో బందోబస్తుకు పంపినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే రేవంత్ సర్కారుపై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం.. ఇదే సమయంలో ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లుకు ముఖ్యమంత్రి రానుండడంతో పర్యటనపై ఎక్కడ ప్రభావం పడుతుందోననే ఉద్దేశంతో పోలీసు శాఖ అలర్ట్ అయింది.
ఇందులో భాగంగా సీఎం పర్యటనలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల ముందునుంచే ఇం టెలిజెన్స్ బృందాలు నగరంలో మకాం వేశాయి. లగచర్ల సంఘటన ప్రభావం ఉంటుందా? అనే కోణాల్లో ఆరా తీసి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వరంగల్ పోలీసు కమిషనరేట్ అధికారులు రెండు రోజులగా గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల నాయకులపై నిఘా పోకస్ పెట్టారు.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను మంగళవారం తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం పర్యటన కొనసాగే హనుమకొండ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రం, సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం సభా ప్రాంగణం, సీఎం కాన్వాయ్ ప్రయాణించే రూట్లలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. పర్యటనకు ఒక రోజు ముందుగానే పలువురు రాష్ట్రస్థాయి ఐపీఎస్ అధికారులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. విధుల్లో వరంగల్ పోలీసు కమిషనరేట్‌తో పాటు రాష్ట్రం నలుమూల నుంచి 1500 మంది విధులు నిర్వర్తించనున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.