జనగామ, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎంపిక చేసిన పైలట్ గ్రామాలు.. లబ్ధిదారుల జాబితాలు ప్రహసనంగా మారాయి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపికచేసి లబ్ధిదారులకు నాలుగు పథకాలు వందశాతం అమలు చేస్తామని జనవరి 26న అట్టహాసంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. జనగామ జిల్లాలోని అన్ని పైల ట్ గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న ‘నమస్తే తెలంగాణ’ జనగామ మండలం ఎర్రకుంట తండా, రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది.
అయితే ఆయా గ్రామా ల్లో అట్టహాసంగా లబ్ధిదారుల జాబితాను చదివిన అధికారులు కొద్ది మందికే ప్రొసీడింగ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ గ్రామాల్లో పథకాల అమలు అటుంచితే కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నా.. వాటిని పట్టించుకునే నాథుడే లేడు. గ్రామపంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు మరమ్మతుకు వచ్చి మూలనపడ్డాయి. గ్రామపంచాయతీలో ట్రాలీలు కూడా రోడ్డున పక్కన పడేయడంతో పారిశుధ్య నిర్వాహణ అధ్వానంగా మారింది.
డంపింగ్ యార్డులు వినియోగంలో లేక శిథిలావస్థకు చేరగా.. చెత్త సెగ్రిగేషన్ షెడ్లు ఉపయోగంలో లేవు. శ్మశాన వాటికలు నిర్వాహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయి. జిల్లాలోని బచ్చన్నపేట మం డలం సాల్వాపూర్, చిల్పూరు మండలం ఫత్తేపూర్ శివారు గొర్లగడ్డతండా, దేవరుప్పుల మం డలం మాదాపురం శివారు లకావత్‌తండా, స్టేషన్నఘన్పూర్ మండలం తానేదార్పల్లి, జనగామ మండలం పెద్దపహాడ్ శివారు ఎర్రకుంటతండా, కొడకండ్ల మండలం మొండ్రా యి శివారు నీళ్లబావి తండా, లింగాలఘనపురం మండలం కొత్తపల్లి, నర్మెట మండలం బొమ్మకూరు, పాలకుర్తి మండలం తీగారం, రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి, తరిగొప్పుల మండలం వాచ్చాతండా, జఫర్గడ్ మండలం శంకర్తండాను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేసి నాలుగు పథకాలను వందశాతం అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు.
అయితే ఇందులో రెండింటిలోనే కదలిక ఉండ గా, మరో రెండు అటకెక్కాయి. దీంతో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆశపడ్డ వారికి నిరాశే మిగిలింది. ఎక్కడా కూడా పూర్తిస్థాయి లో అన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. జాబితాల్లో పేర్లున్న వారం తా లబ్ధిదారులు కాదని, మళ్లీ తుది జాబితా ఉంటుందని అధికారులు ప్రకటించడంతో అంతటా గందరగోళ పరిస్థితి నెలకొన్నది. పైలట్‌తో సహా మిగిలిన గ్రామాల్లో ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాల్లోపు విస్తీర్ణం కలిగిన రైతుల్లో సగం మందికే రైతు భరోసా జమచేయడంతో కాం గ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రఘునాథపల్లి : మండలంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన కన్నాయపల్లిలో సుమారు 826 జనాభా ఉండగా అందులో 673 మంది ఓటర్లున్నారు. గ్రామంలో 243 మందికి రేషన్‌కార్డులు, 20 మందికి ఆత్మీయ భరోసా, 45 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. 19 మంది ఇండ్లకు ముగ్గులు పోసినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రైతుభరోసా కొంతమందికే జమయ్యిందని రైతులు వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఎండిపోగా, క్రీడా ప్రాంగణంలోని పరికరాలు నిర్వహణ లేక తుప్పుపట్టాయి. వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన నీటి ట్యాంక్ కిందపడిపోయింది. తమది పేరుకే పైలట్ గ్రామమని, ఏడాదిగా కనీస అభివృద్ధికి నోచుకోలేదని గ్రామస్తులు అన్నారు. కేసీఆర్ పాలనలోనే సకాలంలో పథకాలు అందాయని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు.
జనగామ రూరల్ : జనగామ మండలంలోని పైలట్ గ్రామమైన ఎర్రకుంట తండాలో సుమారు 800 వరకు జనాభా ఉంటుంది. ఈ గ్రామంలో నాలుగు పథకాల కోసం దరఖాస్తులు తీసుకున్న అధికారులు గ్రామసభలో అర్హుల జాబి తా చదివి వినిపించారు. అందులో కొద్దిమందికే మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లకు 41 మంది, కొత్త రేషన్ కార్డులకు 18 మందికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
కానీ, ఇప్పటి వరకు ఇం డ్లు కట్టింది లేదు.. రేషన్ కార్డులు ఇచ్చింది లేదు. భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మిగతా పథకాల అమలు జాడలేదు. గ్రామం లో కొత్తగా ఒక్క సీసీ రోడ్డు వేయలేదని, డ్రైనేజీలు ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అర్హులున్నా కొందరినే ఎంపిక చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందనే నమ్మకం లేదన్నారు. కేవలం 50 గజాల్లో ప్రభుత్వం చెప్పినట్లు నిర్మిస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని అధికారులు అంటున్నారని లబ్ధిదారులు తెలిపారు.
దేవరుప్పుల మండలం లకావత్ తండాను మోడల్ గ్రామపంచాయతీగా ప్రకటించి ప్రత్యేక గ్రామసభను గణతంత్ర దినోత్సవం రోజు ఏర్పాటు చేశారు. ఆరుగ్యారెంటీలు ఈ గ్రామంలో వందశాతం అమలు చేస్తామని ప్రకటించి 53 మందికి ఇండ్లు, 56 మందికి రేషన్ కార్డులు, 11 మంది మహిళలకు ఆత్మీయ భరోసా పత్రాలు చేతికందించి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు ఇండ్లు లేవు, రేషన్‌కార్డులు లేవు, ఆత్మీయ భరోసా జాడలేదు. రైతు భరోసా మాత్రం మూడెకరాల వరకు మాధాపురం రెవెన్యూ గ్రామాల రైతులకు జమైనయ్.
-బానోత్ యాకూనాయక్, మాధాపురం మాజీ ఎంపీటీసీ