సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ వైరల్ ఫీవర్ అందరినీ వణికిస్తున్నది. ముఖ్యంగా మారుమూల పల్లెలు, తండాలు, గూడేల్లో జ్వరాల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నా స్థానికంగా వైద్యం అందక ప్రైవేట్ దవాఖానలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. అంతుచిక్కని జ్వరాలు, నొప్పులతో ఊరికి ఊరే మంచంపట్టగా, చాలాచోట్ల గ్రామానికి సగటున 10 మంది జ్వరపీడితులే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వర్షాలతో మురుగునీరు నిలువడం, దోమలు, ఈగలు వృద్ధి చెందడం, కలుషిత నీటి ప్రభావం, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అయితే స్థానిక వైద్యాధికారులు నామమాత్రంగా వచ్చి వెళ్తున్నారు తప్ప వైద్య శిబిరాలు నిర్వహించడం లేదని, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం లేదని.. ఇప్పటికైనా జ్వరాలను నియంత్రించాల్సిన అవసరమున్నదని ప్రజలు కోరుతున్నారు.
– నర్సింహులపేట/ఏటూరునాగారం/ కమలాపూర్, జూలై 31
జ్వరాలతో గొత్తికోయగూడెంవాసులు సతమతమవుతున్నారు. వైద్యశాలలు దూరంగా ఉండడంతో సరైన చికిత్స పొందలేకపోతున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దోమలు వృద్ధి చెందడం, సరైన తాగునీటి సదుపాయం లేక సమీప వాగుల్లో చెలిమెల నీటినే తాగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి సమీపంలోని చింతలమోరి గ్రామానికి చెందిన కుంజం బీమా అనే 4వ తరగతి విద్యార్థి వారం రోజులుగా జ్వరం, కడుపులో మంటతో బాధపడుతూ ఇటీవల వైద్యం కోసం ములుగు ప్రభుత్వ దవాఖానకు వెళ్లాడు.
అయితే గోలీలు ఇచ్చారని వాడినా జ్వరం తగ్గకపోవడంతో ఇంటి వద్దే ఉన్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇక పస్రా సమీపంలో మండలతోగు గొత్తికోయ గ్రామానికి చెందిన మడకం చుక్కమ్మ కూడా 15రోజులుగా జ్వరంతో బాధపడుతూ వైద్యశాలకు వెళ్లగా తగ్గడం లేదంటున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందినప్పటికీ తగ్గకపోవడంతో నాటు వైద్యంపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు గొత్తికోయగూడేల్లో శిబిరాలు ఏర్పాటుచేసి సర్కారీ వైద్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరమున్నది.
పేదలు జ్వరంతో ప్రైవేట్ దవాఖానలకు పరుగు పెడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాలు, తండాల్లో వైద్యాధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోగా కనీసం అవగాహన కార్యక్రమాలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంతో పాటు పడమటిగూడెం, కౌసల్యదేవిపల్లి, జయపురం, ముంగిమడుగు, పెద్దనాగారం గ్రామాల్లో ఎంఎల్హెచ్పీలు ఉన్నప్పటికీ వంతడపల గ్రామంలో వైద్యాధికారి ఇప్పటివరకు గ్రామాల్లో, శివారు తండాల్లో పర్యటించిన దాఖలాల్లేవని వారు మండిపడుతున్నారు. పల్లె దవాఖానలో ఉండే ఎంఎల్హెచ్పీలకు తండాల పేర్లు ఎక్కడ ఉంటాయే తెలియదని, కనీసం అటువైపు కన్నెత్తి చూసిందని లేదని గిరిజనులు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటివరకు మండలంలోని పల్లె దవాఖానలు పరిశీలించలేదని బహిరంగగానే విమర్శిస్తున్నారు.
మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో దంతాలపల్లి వైద్యాధికారులు మాత్రం చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారే తప్ప గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం లేదని చెబుతున్నారు. మండల ప్రజలు. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారు తప్ప తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వర్షాల సీజన్లో వాటర్ ట్యాంకులను శుభ్రం చేయకపోవడం వల్ల తాగునీరు కలుషితం అవుతున్నదని ఇప్పటికైనా స్పందించి గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.