ఖానాపురం, ఆగస్ట్ 16 : మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే రామప్ప-పాకాల ప్రాజెక్ట్ సాధ్యమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాకాలను సందర్శించి కట్టమైసమ్మకు, మత్త డి వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ప్రాంత రైతులకు వరప్రదాయినిగా ఉన్న పాకాలకు శాశ్వత జలవనరులు కల్పించాలనే లక్ష్యంతో నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావును ఒప్పించి రామప్ప-పాకాల, రంగాయచెరువు లింక్డ్ ప్రాజెక్టును పూర్తిచేసిన ట్లు తెలిపారు. పాకాలను గోదావరి జలాలతో నింపుకోవడంతో గత యాసంగి పంట పూర్తయ్యేనాటికి సరస్సులో 18.6 అడుగుల నీరుందని, దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు నిండిందన్నారు. నాడు పాకాల ప్రాజెక్ట్ అంతా బోగస్ అన్న నాయకులే ఇప్పుడు పూజలు చేస్తున్నారని అన్నారు.
ఎస్సారెస్సీ కాల్వలను పునర్నిర్మించి సమృద్ధిగా నీళ్లిచ్చామని, అయితే ఇప్పుడవి ఎందుకు ఎండిపోతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థాని క ఎమ్మెల్యే నిండిన పాకాలకు పూజలు చేస్తున్నారు తప్ప ఎండి న ఎస్పారెస్పీ కాల్వలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డీబీఎం 38, 40, 48 ద్వారా నియోజకవర్గంలోని చెన్నారావుపేట, నెక్కొండ, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లోని 257 చెరువులను గోదావరి జలాలతో నింపినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను తీసుకొచ్చిన రూ. 500 కోట్లకు పైగా నిధులు ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ట్రైబ ల్ వెల్ఫేర్ శాఖల్లో నిల్వ ఉన్నాయన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి నుంచి రూపా యి తీసుకొచ్చే దమ్ము, ధైర్యం లేదన్నారు. తాను తెచ్చిన నిధులను అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలని, ఒక్క పైసా వెనక్కి పోయినా ఊరుకునేదిలేదన్నారు. ఇకపై నియోజకవర్గం లో అభివృద్ధి పనులు జరగకపోతే తిరుగుబాటు తప్పదని పెద్ది హెచ్చరించారు. ఆయన వెంట జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సొసైటీ చైర్మన్ రామస్వామినాయక్, కొండవీటి ప్రదీప్‌కుమార్, బందారపు శ్రీనివాస్, వల్లెపు శ్రీనివాస్, కాస ప్రవీణ్‌కుమార్, మౌలానా, బాబురావు, ఉపేందర్‌రెడ్డి, మస్తాన్, మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణ తదితరులున్నారు.