నర్సంపేట, మార్చి 12: నర్సంపేటలో రోజురోజుకు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న భూ కబ్జాల్లో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులూ వాటాదారులేనని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని నెక్కొండ రోడ్డులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. నర్సంపేట ప్రాంతంలో జరుగుతున్న వరుస ఘటనలు, కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు పూర్తి సహకారం అందిస్తున్నది పోలీస్ అధికారులేనని విమర్శించారు.
సామాన్యుడికి పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే.. వారిపైనే కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్, సీపీ, డీసీపీలు నర్సంపేట ప్రాంతంలో జరుగుతున్న ఘటనలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును కూడా పరిగనలోకి తీసుకోకపోవడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ నెల 13 వరకు స్టేటస్ కో ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని పెద్ది నిలదీశారు.
రోడ్డు క్లోజ్ చేస్తే పోలీసులు బారికేడ్లు ఎలా ఏర్పాటు చేస్తారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిలో ఉన్నవారికి క్రమబద్ధీకరించాలని అసెంబ్లీలో మాట్లాడినట్లు గుర్తుచేశారు. చాలాకాలంగా నర్సంపేటలో నివాసముంటున్న పేదల భూములపై లోపాలను ఎత్తిచూపి కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. సర్వే నంబర్ 111, 702 అసైన్డ్ భూములు 60 శాతం ఉన్నాయని, 702లో 15 రోడ్లు ఉన్నాయని, వాటికి పోలీసులు బారికేడ్లు పెడతారా అని పెద్ది ప్రశ్నించారు.
అనంతరం వెంచర్లో ధ్వంసం చేసిన రోడ్డును ఆయన పరిశీలించారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, నర్సంపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ కౌన్సిలర్లు మండల శ్రీనివాస్, బండి రమేశ్, నాగిశెట్టి ప్రసాద్, వెంకటేశ్వర్లు, నాయకులు బత్తిని శ్రీనివాస్, పైస ప్రవీణ్, దొమ్మాటి సంతోష్, నాయిని వేణు, దేవోజు సదానందం, దేవోజు హేమంత్ పాల్గొన్నారు.