నర్సంపేట(ఖానాపురం), సెప్టెంబర్12 : యూరియా కొరతకు సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నైతిక బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఖానాపురం మండలం మంగళవారిపేట, గొల్లగూడెం తండాల్లో సకాలంలో యూరి యా దొరకక నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత వల్ల సన్న చిన్నకారు రైతులకు సంబంధించిన పత్తి, వరి, మక్కజొన్న పంటలు పూర్తిగా ఎర్రబారి పోతున్నాయని అన్నారు.
నెలల తరబడి కుటుంబసభ్యులతో కలిసి యూరియా కోసం లైన్లో నిలబడి అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. ఎకరాకు ప్రభుత్వం రూ.50వేల నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు ఉంటాయని పెద్ది హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏముఖం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారని ఆయన ప్రశ్నించారు.
రైతులకు యూరియా అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఖానాపురం మండల వ్యవసాయ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రైతులు ఏమాత్రం అధైర్య పడొద్దని, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. పంటనష్ట పరిహారం అందించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నిలదీయాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రామసహాయం ఉపేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు బాలకిషన్, రమేశ్, వెంకన్న, మాజీ ఎంపీటీసీలు పూలునాయక్, క్లస్టర్ ఇన్చార్జీలు పులిగిల్ల లింగన్న, యాదగిరి, ఎస్కే మౌలానా, గ్రామ పార్టీ అధ్యక్షులు ముచ్చ యాదగిరిరావు, బందారపు శ్రీను, తేజావత్ బాలునాయక్, యాదగిరి, పాషా, సొసైటీ మాజీ డైరెక్టర్లు రాజు, అశోక్, నాయకులు ఎస్కే నాగూల్‌మీరా, వెంకన్న, రమేశ్ ఉన్నారు.