సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రానికి అవార్డులు
75 ఏండ్లలో కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదు
ప్రజలను, కులవృత్తులను ఆగం చేశారు..
నీళ్లు, నిధులు, పనుల్లేక వలసపోయే దుస్థితి తెచ్చారు..
తెలంగాణ వచ్చాకే అభివృద్ధి పథంలో రాష్ట్రం
ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోదామా?
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉందామా?
వేములపల్లి సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎమ్మెల్యే గండ్రతో కలిసి ‘పల్లె ప్రగతి’ పనులకు హాజరు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 12( నమస్తే తెలంగాణ) : దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డా రు. 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడాలని గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బందిని ఆదేశించారు. అలాగే సెర్ప్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు.
అనంతరం జడ్పీ పాఠశాల ఆవరణలో పల్లె ప్రగతి సమావేశంలో అధికారులతో కలిసి గ్రామాభివృద్ధి, పల్లె ప్రగతిపై అంశాలవారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? వైకుంఠధామం, డంపింగ్ యార్డు వినియోగిస్తున్నా రా? చెత్తను ఎరువుగా మార్చుతున్నారా? ట్రాక్టర్, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది ? ఇలా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మీ అందరి అభిమానం, సీఎం కేసీఆర్ దయ వల్లే తాను మంత్రిని అయ్యానని, గ్రామాలను అభివృద్ధి చేసే అవకాశం ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు తనకు సీఎం అప్పగించారని చెప్పారు. గత ప్రభుత్వాల పాలనలో నీళ్లు, నిధులు, పనులు లేక ప్రజలు, కుల వృత్తులు ఆగమై వలసపోయే దుస్థితి ఉండేదని.. కొట్లాడి సాధించు కున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షే మంలో దూసుకు
పోతున్నదని వివరించారు.
పల్లె ప్రగతితో సకల సదుపాయాలు..
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా మారాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అభివృద్ధి గురించి నోటికచ్చినట్లు మాట్లాడే కొందరు బీజేపీ నేతలకు మంత్రి తన పనితీరుతో సరైన జవాబు చెబుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచి, ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నదని మండిపడ్డారు. గత పాలకులు ప్రజల సమస్యల గురించి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల గురించి ఆలోచించి ఉంటే ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వానికి ఇంత చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. ఇప్పుడు పల్లె ప్రగతితో గ్రామాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. – ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చెడగొట్టెటోడు ఊరికొక్కడు ఉంటడు..
గత 75 సంవత్సరాల నుంచి దేశాన్ని, రాష్ర్టాన్ని నాశనం చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులే.. ఇప్పుడు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనున్న ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు లేవని, అయినా తెలంగాణలో ఏమీ జరగడం లేదని ఆరోపిస్తున్నారంటూ మండిపడ్డారు. చేతగాని వాళ్లు ఏవేవో మాట్లాడుతారని అవన్నీ పట్టించుకోకుండా అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. వాళ్ల మాయమాటలకు బోల్తా పడదామా? మన కోసమే పనిచేసే సీఎం కేసీఆర్‌ను కాపాడుకుందామా? అని ప్రజలను కోరారు. ప్రజలు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయాలను విశ్లేషించుకోవాలని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూడాలని కోరారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి చేపట్టిన నాటి నుంచి అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయని, వాటిని కేంద్రమే ఇస్తున్నదని తెలిపారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.5 కోట్ల 3లక్షల చెకులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు.
చెత్త ఎత్తి ట్రాక్టర్లో పోసి..
పల్లె ప్రగతి పనుల్లో మంత్రి ఎర్రబెల్లి భాగం పంచుకున్నారు. వేములపల్లికి వచ్చిన ఎర్రబెల్లి ఒక్కసారిగా వాహనం దిగి పారిశుధ్య కార్మికుల దగ్గరికి వెళ్లారు. వారి దగ్గరి నుంచి పార తీసుకొని చెత్త ఎత్తి ట్రాక్టర్లో పోశారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర కలిసి శ్రమదానం చేసి కార్మికుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఆర్డీఓ పురుషోత్తం, డీఏఓ విజయభాస్కర్, సర్పంచ్ మాధవి, ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ సదయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు రఘుపతిరావు, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
గిట్లయితే మీ నౌకర్లుండయ్..!
శాయంపేట, జూన్ 12 : శాయంపేట మండలం పత్తిపాకలో మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారంలో గ్రామంలో కలియదిరిగి రోడ్లు, మురుగు కాల్వలను పరిశీలించి పారిశుధ్య నిర్వహణ ఇలాగేనా.. ఇదేనా పల్లెప్రగతి అంటూ జడ్పీ సీఈవో, డీపీవోలపై అసహనం వ్యక్తం చేశారు. పల్లెలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నరు. మీకు వస్తున్నాయా? రానివారు మొహమాటం లేకుండా చెప్పాలి. నేను అది తెలుసుకునేందుకే వచ్చాను’ అని అడుగడంతో కొందరు మహిళలు రావడం లేదని చెప్పారు. దీంతో మంత్రి వెంటనే భగీరథ అధికారులను పిలిచారు. నీళ్లు ఇయ్యకుంటే మీ ఇద్దరి నౌకర్లు ఉండవని హెచ్చరించారు. 90శాతం నీళ్లు వస్తున్నాయని చెప్పారని పది శాతం రావడం లేదని చెప్పారని వీరికి కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. వారం రోజుల్లో నీళ్లు ఇస్తామని చెప్పడంతో నిర్లక్ష్యం చేయకుండా అందించాలన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.