వరంగల్ చౌరస్తా, జూలై 25: ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ల నిర్లక్ష్యం రోగులు, అటెండెంట్ల పాలిట శాపంగా మారింది. రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి రికార్డుల నమోదులో మెడికల్ లీగల్ కేసుగా నమోదు చేయకుండానే మూడు రోజులు చికిత్స అందించారు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా చిన్నపెండ్యాలకు చెందిన చుక్క రాజయ్య (54) జూన్ 15వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, 108 వాహనంలో ఎంజీఎంహెచ్కు తరలించారు.
చికిత్స పొందుతున్న సమయంలో రాజయ్య కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాధితుడిని తిరిగి జూలై 20న ఎంజీఎంహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. ఈ క్రమంలో 23వ తేదీ అర్ధరాత్రి మృతి చెందాడు. ఎంజీ ఎంహెచ్ సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించి, రికార్డులో నమోదు చేశారు. రికార్డులు పరిశీ లించిన ఫోరెన్సిక్ వైద్యుడు క్యాజువాలిటీ విభాగంలో మెడికో లీగల్ కేసు(ఎంఎల్సీ) నమోదు చేయకపోవ డంతో పోస్టుమార్టం నిర్వహించడానికి నిరాకరించడంతో అసలు విషయం బయటపడింది.
ఈ విషయం బయటకు పొక్కకుండా క్యాజువాలిటీ అధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి గురువారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం ఎంఆర్డీ విభాగం ఉద్యోగులు విధులకు హాజరైన సమయంలో కేస్ షీట్లో ఎంఎల్సీ వివరాలు నమోదు చేసి, రికార్డులను జతపరిచారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టుమార్టం అనంతరం ఎంఎల్సీ రికార్డులను నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఆర్ఎంవో డాక్టర్ వసంతరావును వివరణ కోరగా విచారణ జరిపి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధి కారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రమాదాలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యాయత్నాలు, విష ప్ర యోగాలు జరిగిన సందర్భాల్లో వైద్యులు మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)లుగా గుర్తించి బాధితుడి పూర్తి సమాచారం నమోదు చేసుకుంటా రు. ఎంజీఎం ఔట్‌పోస్టుకు సమాచారం అందించి సమాచారాన్ని ఘట న జరిగిన పరిధి పోలీసు లకు చెప్తారు. వైద్యుడు అందించిన వివరాల ఆధారంగా పోలీసులు రికార్డులను కోర్టుకు సమర్పిస్తారు.
వీటి ఆధారంగానే మరణ ధ్రువీకరణ పత్రాలు, క్షతగాత్రుడికి అందించిన వైద్య వివరాలు రికార్డు చేయ బడతాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్న రికార్డు ల విషయంలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సీఎంఓలు విధులకు హాజరుకాకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించి పత్రాలపై ముందుగానే సంతకాలు చేసి జూనియర్లకు అప్పగించి వెళ్తుండడంతో రోగులు, మృతుల కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.