చెన్నై, మార్చి 7: నటుడు, టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత(51) శనివారం మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. తన విడాకుల పిటిషన్పై నిర్ణయం వెలువడేవరకు తన భర్త ఇంట్లో నివసించేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద దాఖలు చేసిన పిటిషన్లో ఆమె తనకు ఉండేందుకు సొంత ఇల్లు లేదని తెలిపారు. తనకు నివాస రక్షణతోపాటు ఆర్థికపరమైన చేయూతను అందచేయాలని తన పిటిషన్లో కోరారు.
దేశంలో తనకు సొంత ఇల్లు ఏదీ లేదని బ్రిటన్ పౌరురాలైన సంగీత పేర్కొన్నారు. తన భర్త ఇంట్లో నివసించే హక్కును తనకు కల్పించాలని లేదా ప్రత్యామ్నాయ వసతిని కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేగాక తనకు న్యాయబద్ధమైన, సహేతుకమైన శాశ్వత మనోవర్తిని కూడా అందచేయాలని ఆమె తన పిటిషన్లో కోరారు. కోర్టుకు వెళ్లవద్దని తన భర్త విజయ్(51) తనను బెదిరించినట్లు ఆమె ఆరోపించారు. చట్టపరంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తే తన ఇంట్లో నివసించేందుకు అనుమతించబోనని విజయ్ తనను బెదిరించినట్లు ఆమె తన పిటిషన్లో స్పష్టం చేశారు.