నమస్తే, నెట్వర్క్, మే 13 : : హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. వరంగల్ కలెక్టరేట్ కంట్రోల్ రూంలోని వెబ్‌కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆర్వో పీ ప్రావీణ్య, ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్‌చంద్ ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. వరంగల్ తూర్పులోని ఇస్లామియా కళాశాల పోలింగ్ కేంద్రం, మహిళలతో నిర్వహిస్తున్న కిడ్డీ కూప్ పాఠశాల పోలింగ్ కేంద్రాలను ఆర్వో ప్రావీణ్య సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.తూర్పు కొత్త ఓటర్లు 6,368 ఓటు హక్కును వినియోగంచుకుని సెల్ఫీలు దిగారు.
కిడ్డీ కూప్ పాఠశాలలోని క్రిటికల్ అండ్ మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ట్రైనీ ఐపీఎస్ శుభంనాగ్ సందర్శించారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాలను సీపీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. హనుమకొండ జిల్లాలో 64.76 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, పోలింగ్ సరళిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ పరిశీలించారు. అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, వెంకట్ రెడ్డి ఉన్నారు. కాగా, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం 5గంటల వరకు 73.01శాతం పోలింగ్ నమోదైంది. నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వేర్వేరుగా పరిశీలించారు.
వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 66.43శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పుస్కోస్ పాఠశాలలో పోలింగ్ సరళిని కేంద్ర ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణవీర్ చంద్ పరిశీలించారు. మధ్యాహ్నం సీపీ అంబర్కిశోర్ ఝా పోలింగ్‌ను పరిశీలించారు. పర్వతగిరిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సతీమణి ఉషాదయాకర్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నల్లబెల్లి జడ్పీ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వర్ధన్నపేటతోపాటు దౌలత్‌నగర్, వడ్లకొండ, పర్వతగిరి, ఖానాపురం మండలం బుధరావుపేట, మడికొండ పరిధి కుమ్మరిగూడెం, కాజీపేట, శాయంపేట మండలం ప్రగతి సింగారంలో ఈవీఎంలు మొరాయించాయి. నెక్కొండ మండలం రెడ్లవాడ పోలింగ్ స్టేషన్లో 259వ బూత్‌లో ఈవీఎంలు మొరాయించడంతో రెండు గంటలకు పైగా ఓటింగ్ నిలిచి ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.