పాలకుర్తి రూరల్, జూలై 18: రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ వద్దు..3 గంటల చాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని, రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీని రైతులు తన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి వైఖరికి నిరసనగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో రైతులతో కలిసి మండలస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతు ద్రోహుల పార్టీ అని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పెద్ద బ్రోకర్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ, బ్రోకర్ రేవంత్‌రెడ్డి మాటలను తిప్పికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి సమాధి తప్పదని హెచ్చరించారు. కాళేశ్వరంపై రాహుల్‌గాంధీ మాటలు హాస్యాస్పదమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.80వేల కోట్లు కేటాయిస్తే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. రాహుల్‌కు ఎడ్లు తెల్వవు.. వడ్లు తెల్వవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశాన్ని, రాష్ర్టాన్ని ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. రైతుబంధు కింద రూ.7200కోట్లు విడుదల చేశామన్నారు. రైతులకు మోటరు చార్జీలు ఏటా రూ.1.20లక్షల చొప్పున రూ.12వేల కోట్లు ఎన్పీడీసీఎల్కు చెల్లిస్తున్నామన్నారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. అనంతరం దర్దేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గిరగాని యాదగిరి ప్రమాదవశాత్తు చనిపోగా పార్టీ బీమా చెక్కు రూ.2లక్షలు అతడి బార్య విజయకు మంత్రి ఎర్రబెల్లి అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ పాల్గొన్నారు.