హనుమకొండ చౌరస్తా : పంచాయతీ ఎన్నికలను ( Panchayat Elections ) వాయిదా వేయాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ ( Kurapati Ramesh) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి రమేశ్ మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు కామారెడ్డిలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ (Kamareddy Declaration ) ప్రకటించిందని గుర్తు చేశారు. అధికారంలోకొచ్చిన తర్వాత అసెంబ్లీలో, మండలిలో రెండు వేర్వేరుగా విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆర్డినెన్స్ద్వారా జీవో 9ని విడుదల చేసిందన్నారు.
ఈ జీవోను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టి వేయగా హడావుడిగా 46 జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి పూనుకుంటున్నదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని 42 బీసీ రిజర్వేషన్ల సాధన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఎన్నికలను వాయిదావేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి , వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లులనుపెట్టి ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వీరస్వామి, పరశురాములు, చందా మల్లయ్య, మేకల సుమన్, సురేష్‌గౌడ్, తెలంగాణ కొమరయ్య, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.