జనగామ, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.178 కోట్లు కేటాయించండి..499 ఎకరాలకు మీరు ప్రొక్యూర్ చేస్తే జనగామతో పాటు కింద ఉన్న ఆలేరుకు పూర్తిగా నీళ్లు వస్తాయి.. వెంటనే నిధులు రిలీజ్ చేసి పనులు ప్రారంభించండి.. జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది’ అని గురువారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నాలుగు మోటర్లు ఆన్‌చేసి వెంటనే చెరువులు నింపాలని కోరారు.
ఇంతకుముందు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సమస్యలు తెలిపానన్నారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఎకువ భాగం జనగామ నియోజకవర్గంలోనే ఉంటుందని, పలు ప్యాకేజీల్లో మిగిలిన 499 ఎకరాల భూమిని ప్రొక్యూర్ చేసి రూ. 178 కోట్లు కేటాయించి పనులు పూర్తిచేస్తే జనగామ, ఆలేరు ప్రాంత రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల ఆలేరు ఎమ్మేల్యే తపాస్‌పల్లి నుంచి నీళ్లన్నీ తీసుకెళ్లడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నదన్నారు.
ప్రస్తుతం జనగామ జిల్లాలోని 484 చెరువులు నింపేందుకు అంతా సిద్ధంగా ఉందని, ధర్మసాగర్ నుంచి గండిరామారం, అక్కడి నుంచి తపాస్‌పల్లి సహా మొత్తం రిజర్వాయర్లు నింపుకుంటే యాసంగి పంటలకు ఇబ్బందులుండవన్నారు. అధికారులు కూడా ఏ చర్యలు తీసుకోవడం లేదని, నాలుగు పంపులుంటే ఒక దానిని మాత్రమే నామమాత్రంగా నడుపుతున్నారని, అన్నింటిని ఆన్ చేసి మెజారిటీ చెరువులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.