జనగామ, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : జనగామ పట్టణంలోని అసంపూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇండ్ల సమస్యపై అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్తిచేయకుండా వదిలేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న 800 ఇండ్ల్లను పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. స్లాబ్ దశలో నిలిచిపోయిన వాటిని వెంటనే పూర్తి చేయాలని, అర్హుల ఎంపికలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ ఎల్-1, ఎల్-3 జాబితాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
వాహనం ఉన్న కారణంతో అర్హతను రద్దు చేయడం సరికాదన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన 800 ఇళ్లకు కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే పూర్తవుతాయని, బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లిలో కూడా కొంతమంది ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయని, ఇదే అంశాన్ని వరంగల్ సమీక్ష లో మంత్రి దృష్టికి తేగా, కలెక్టర్కు సూచనలు చేసినా, కలెక్టర్ మార్పు కారణంగా ప్రక్రియ ఆలస్యమైందన్నారు. ఎన్నికల ముందు ఇళ్ల పూర్తి కోసం ప్రక్రియ ప్రారంభమైనా మధ్యలోనే నిలిచిపోయిందని, కొంతమంది లబ్ధిదారులు అనుమతి, అలాట్మెంట్ లేకుండా ఇళ్లలో నివసిస్తున్న పరిస్థితి ఉందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో లోపాలు ఉన్నాయని, ఎల్-1 జాబితాలో లేకపోవడం పేరుతో ఇళ్ల మంజూరు నిలిపివేస్తున్నారని, వృత్తి అవసరాల కోసం వాహనం ఉన్నా అర్హతకు అడ్డంకిగా చూపడం సరికాదన్నారు. ఎల్-3, ఎల్-1లో లేరనే కారణంతో తిరసరించడం తప్పన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పి, 3,24,536 ఇళ్లు మాత్రమే మంజూరు చేశారని, అందులో 2,62,468 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైతే, ఈ ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 2,62,000కు పైగా ఇళ్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సంవత్సరం ప్రకటించిన 3,500 ఇళ్లకే సుమారు రూ.3,000 కోట్లు లోటు ఉందని, వచ్చే సంవత్సరానికి కూడా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు ఎలా సమకూర్చుతారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.