నల్లగొండ రూరల్, ఆగస్టు 16: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కనుసన్నల్లో కమీషన్ల రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, అర్హులైన లబ్ధ్దిదారులను పక్కనపెట్టి అనర్హులకు ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లపై రీవెరిఫికేషన్ నిర్వహించి, అర్హులకు ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు లంచం అందజేసిన వారికి మాత్రమే నల్లగొండలోని గొల్లగూడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో 546 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించామని చెప్పారు. స్థానికంగా ప్రజల సమక్షంలో 431 ఇండ్లకు డ్రా నిర్వహించి అందులో పేర్లు వచ్చిన అర్హులకే ఇండ్లు కేటాయించామని తెలిపారు. నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పొయిన వారికి కూడా ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చామని, అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో 130 మంది రోడ్డు విస్తరణ బాధితులను ఎంపిక చేశామని తెలిపారు. గతంలో డ్రాలో పేర్లు వచ్చిన వారిలో సుమారు 150 మందికి ఇండ్లు కేటాయించలేదని ఆరోపించారు.
ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను కలెక్టర్ సైతం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రస్తుతం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రక్రియ అప్రజాస్వామికంగా ఉందని ఆరోపించారు. మళ్లీ డ్రా నిర్వహించి అర్హులైన లబ్ధ్దిదారులను ఎంపిక చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియను సరిదిద్దకపోతే బీఆర్ఏస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రస్తుత కేటాయిపులను రద్దు చేసి మళ్లీ డ్రా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఒక్కో ఇంటికి రూ.3 నుంచి 4 లక్షల వరకు లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో డబ్బులు ఇచ్చిన వారు వెంటనే తిరిగి తీసుకోవాలన్నారు. లేదంటే భవిష్యత్‌లో నష్టపోయే అవకాశం ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై రీవెరిఫికేషన్ చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. 15 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. నల్లగొండలో రాక్షస రాజ్యం, కమీషన్ల రాజ్యం నడుస్తోందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండతోనే అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీపీఎం కార్యాలయంపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాట్లు వెల్లడించారు.
ఎస్ఐని సస్పెండ్ చేయాలి
సీపీఎం నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని కంచర్ల భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. నల్లగొండ పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపించారు. అమృత్ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, వెంచర్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి అమృత్ పథకం నిధులను వినియోగిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పార్టీలకతీతంగా నల్లగొండను అభివృద్ధి చేశామని తెలిపారు. 2040 విజన్‌కు అనుగుణంగా నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. నల్లగొండ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో రూ.700 కోట్ల పనుల్లో కమీషన్ల కోసమే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.
అదే విధంగా నల్లగొండ మెడికల్ కళాశాలకు రూ.200 కోట్లు, కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు తీసుకురావాలన్నారు. నల్లగొండ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధ్దంగా ఉన్నానని, మంత్రి కోమటిరెడ్డి సిద్ధ్దమా? అని సవాల్ విసిరారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేశ్, దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, దొడ్డి రమేశ్, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్‌రెడ్డి, జమాల్ ఖాద్రీ, మిర్యాల స్వామి, సందీప్‌రెడ్డి, గుండెబోయిన జంగయ్య యాదవ్, బడుపుల శంకర్, అన్వర్ పాషా, దండేపల్లి సత్తయ్య, రావుల శ్రీనివాస్‌రెడ్డి, గంజి రాజేందర్, పెండెం ధనుంజయ్, నర్ర నిర్మల, రాయల రమేశ్ చంద్ర, తవిట కృష్ణ, ఎలుక శ్రీనివాస్‌రెడ్డి, జిన్నె వెంకట్‌రెడ్డి పాల్నొన్నారు.